బీజేపీలో చేరిన నాగర్‌ కర్నూల్‌ బీఆరెస్‌ ఎంపీ రాములు

బీఆరెస్‌ నాగర్‌ కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.

  • Publish Date - February 29, 2024 / 11:18 AM IST

  • తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే
  • రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌
  • క్యూలో మరో బీఆరెస్‌ ఎంపీ


విధాత: బీఆరెస్‌ నాగర్‌ కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌లు పార్టీ సభ్యత్వాన్ని అందించి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాములుతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా ముఖ్య నేతలు ఆర్‌. లోక్‌నాథ్‌,రెడ్డి, జక్క రఘునందన్‌రెడ్డి, మిట్టపల్లి పురుషోత్తంరెడ్డిలు బీజేపీ పార్టీలో చేరారు. జహీరాబాద్‌ బీఆరెస్‌ సిటింగ్‌ ఎంపీ బీబీ.పాటిల్‌ కూడా త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది.


కాగా రాములు చేరిక సందర్భంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ మాట్లాడుతూ నాగర్‌ కర్నూల్‌ ఎంపీ రాములు చేరికను బీజేపీ స్వాగతిస్తుందన్నారు. పార్టీలోకి మరో దళిత నేత చేరడం హర్షనీయమన్నారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనన్నారు. తెలంగాణలో బీఆరెస్‌, కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నారు. త్వరలోనే బీఆరెస్‌ నుంచి మరిన్ని చేరికలుంటాయన్నారు. తెలంగాణలో తిరుగులేని శక్తిగా బీజేపీ మారుతుందన్నారు. తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలతో బీజేపీ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందే ప్రచారంలో దూసుకెలుతుందన్నారు.


ప్రధాని మోడీ సైతం మార్చి 4,5తేదీల్లో తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు రానున్నారని తెలిపారు. దేశ ప్రజలంతా ప్రధాని మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందన్నారు. తెలంగాణలో సైతం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, గతంలో కాంగ్రెస్టి, బీఆరెస్‌లకు ఓట్లు వేసిన వారు కూడా ఈసారి మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో బీఆరెస్‌ పార్టీ మునిగి పోయిన పడవ అని, కాంగ్రెస్‌ మునగబోయే పడవన్నారు. కేసీఆర్‌ నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని నాశం చేశారన్నారు. బీఆరెస్‌ కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదన్నారు.


ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చూస్తే హిమాచల్ ప్రదేశ్‌, కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చన్నారు. ప్రజలు మార్పు కోరిన క్రమంలో కాంగ్రెస్‌ లాభపడిందన్నారు. కాని కాంగ్రెస్‌ పాలన సరైన దిశలో సాగడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కప్పదాట్లు వేస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తి అవుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రభృతులు ఉన్నారు.

Latest News