విధాత: యువగళం పేరుతో.. ఎల్లుండి నుంచి ప్రారంభించబోయే పాదయాత్రకు నారా లోకేశ్ బుధవారం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. యుద్ధానికి పోయే ముందు తల్లిదండ్రులు,పెద్దల దీవెనలు తీసుకున్నట్లుగా.. ఆయన తన తల్లిదండ్రుల దీవెనలు తీసుకొన్నారు.
కుటుంబ సభ్యులు లోకేశ్‌కు అభినందనలు తెలుపగా.. మామ బాలకృష్ణ దగ్గరుండి కారు ఎక్కించి సాగనంపారు. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర 400 రోజులు, 4వేల కిలోమీటర్లు కొనసాగుతుంది.
2012అక్టోబర్ ౩న చంద్రబాబు వస్తున్నా మీకోసం అని పాదయాత్ర చేసి అధికారంలోకి రాగా, చేవెళ్ల నుంచి విశాఖ పట్నందాకా పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అఖండ విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ కోవలో జగన్ పాదయాత్రను కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్.. పాద యాత్రకు సమాయత్తం కావటం గమనార్హం.