Site icon vidhaatha

Dr.BR Ambedkar | జాతి గర్వించే అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ నేడే.. ప్రత్యేకతలివే

విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ (Dr.BR Ambedkar) 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ తరహాలో నిర్మించి పర్యాటక, విజ్ఞాన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపింది.

దీనికోసం రూ. 146.50 కోట్లు కేటాయించింది. హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ను ఆనుకుని సుమారు 11.80 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. నిర్మాణ పనులకు ఎస్సీ సంక్షేమ నిధులు సమకూర్చగా.. నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించి, ఆ శాఖ ఈఎన్‌సీ ఈ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని అప్పుడు నిర్ణయించినప్పటికీ.. అధ్యయనం, నిర్మాణశైలి తదితర పనుల వల్ల పనుల్లో జాప్యం జరిగింది. దీనిపై విపక్షాలు కూడా కొన్నిసార్లు నిర్మాణ స్థలం వద్ద నిరసన తెలిపాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విమర్శలేవీ పట్టించుకోలేదు. నిర్మాణం ప్రారంభమై తుది రూపు చేరుకున్నాక నిత్యం వందలాదిమంది మూర్తీభవించిన ఆ మహనీయుడి విగ్రహం ముందు సెల్ఫీలు తీసుకుంటూ మురిపోతున్నారు.

రాజ్యాంగ నిర్మాత ముందుచూపుతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని సీఎం అనేక సందర్భాల్లో చెప్పారు. మెజారిటీ అభిప్రాయం మేరకే కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలంటే మైనారిటీలకు ఎన్నటికీ న్యాయం జరగదని అందుకే ఆర్టికల్‌ 3లో పేర్కొన్నట్టు కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని పార్లమెంటుకే అప్పగించారు.

పార్లమెంటు సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు, సరిహద్దులను మార్చవచ్చని పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి ఫలితంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని పేరు పెట్టి గౌరవించుకున్నది.

దేశంలోనే ఎత్తైన విగ్రహం.. రేపు ఆవిష్కరించనున్న సీఎం

దేశంలో ఇప్పటివరకు ఉన్న అంబేద్కర్‌ విగ్రహాలలో ఎత్తైనదిగా నిర్మించిన ఈ స్మారకం నిర్మాణం వెనుక అనేక విశిష్టతలు ఉన్నాయి. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠంపై, ఆ పైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని రేపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి సందర్భంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ మనువడు ప్రకాశ్‌ అంబేద్కర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాతినిధులు పాల్గొననున్నారు.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రంగం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు రవాణా సదుపాయలు కల్పిస్తున్నది. అన్నినియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపనున్నది. దాదాపు 50 వేల మంది కూర్చోవడానికి అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలు కల్పనకు ఏర్పాటు పూర్తిచేస్తున్నది.

బౌద్ధ గురువుల ప్రార్థనలు..

విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. జీహెచ్‌ఎంసీ, రోడ్లు భవనాలు, రవాణా, విద్యుత్తు శాఖల అధికారుల సమన్వయంతో అతిథితులకు సౌకర్యాలు కల్పిస్తున్నది. విగ్రహావిష్కరణలో భాగంగా సీఎం మొదట శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు.

ముఖ్యమంత్రిని దాదాపు 30 మంది బౌద్ధగురువులు ప్రార్థనలతో అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత స్థూపం లోపల ఉన్న లిఫ్టులో సీఎం అంబేద్కర్‌ విగ్రమం పాదాల వద్దకు చేరుకుని నివాళుల అర్పిస్తారు. అక్కడ 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. విగ్రహావిష్కరణ అనంతరం హెలిక్టాపర్‌ ద్వారా పూలవర్షం కురిపిస్తారు. తర్వాత అక్కడి బహిరంగ సభలో అహూతులను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

విగ్రహ విశేషాలు..

ఏప్రిల్‌ 14, 2016లో శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణానికి రూ. 146.50 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించింది . డిజైన్‌ అసోసియేట్స్‌, నోయిడాకు కన్సల్టెంట్‌ సంస్థకు అప్పగించారు. సాంకేతిక అనుమతి 2021 జనవరి 23 ఇచ్చింది. గుత్తేదారులతో 2021 జూన్‌ 3న ఒప్పందం చేసుకున్నది. కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌కు గుత్తేదారు బాధ్యతలు అప్పగించారు. ఒప్పందం విలువ రూ. 104. 18కోట్లు ఉండగా.. ఇప్పటివరకు 82.69 కోట్లు ఖర్చు చేసింది.

అంబేద్కర్‌ స్మారక ప్రాంగణ విస్తీర్ణం 11.80 ఎకరాలు కాగా, పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించింది. విగ్రహం స్థూపం (పీఠం) ఎత్తు 50 అడుగులు. పీఠం వెడల్పు 172 అడుగులు. విగ్రహం వెడల్పు 46 అడుగులు, వినియోగించిన ఉక్కు 791 టన్నులు కాగా, ఉపయోగించిన ఇత్తడి 96 అడుగుల మెట్రిక్‌ టన్నులు. మొత్తం విగ్రహం బరువు 465 టన్నులు. రోజూ సుమారు 425 మంది కార్మికులు పనిచేసినట్టు సమాచారం. దేశం గుర్వించేలా రూపుదిద్దుకున్న ఈ అద్భుతకట్టడం విగ్రహ రూపశిల్పి రామ్‌. వి. సుతార్‌

Exit mobile version