విధాత : భారత నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ అడ్వకేట్ ఆర్ వెంకటరమణిని కేంద్రం నియమించింది. ఈ పదవిలో వెంకటరమణి మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. అటార్నీ జనరల్‌గా వెంకటరమణిని నియమిస్తూ కేంద్రం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్ పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. మూడో పర్యాయం కూడా ఏజీగా కొనసాగాలని కేకే వేణుగోపాల్‌ను కేంద్రం కోరినప్పటికీ, ఆయన నిరాకరించారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీని సంప్రదించగా, ఆయన కూడా కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు.
సీనియర్ అడ్వకేట్ ఆర్ వెంకటరమణి.. 1950, ఏప్రిల్ 13న పాండిచ్చేరిలో జన్మించారు. 1977లో తమిళనాడు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా తన పేరును వెంకటరమణి ఎన్‌రోల్ చేసుకున్నారు. 1979లో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1997లో ఆయనను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 2010 నుంచి 2013 వరకు లా కమిషన్ మెంబర్‌గా కొనసాగారు.