విధాత : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం త్వరలో కొత్త గవర్నర్‌ను నియమించే అవకాశముంది. ప్రస్తుత గవర్నర్ తమిళిసై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించున్నారని, తన సొంత రాష్ట్రం తమిళనాడులో నుంచి లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నారన్న ప్రచారం జోరుగా వినిపిస్తుంది. దీనిపై చర్చించేందుకు ఇప్పటికే తమిళి సై మంగళవారం ఢిల్లీకి వెళ్లారని, ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసి తన నిర్ణయాన్ని తెలియచేస్తారని సమాచారం.
పార్టీ అధిష్టానం తన ఆలోచనను ఆమోదించకుంటే పాండిచ్చేరి గవర్నర్‌గా కొనసాగాలని తమిళిసై ఆలోచనగా ఉందని తెలుస్తుంది. ఎంపీగా పోటీ చేసేందుకు తమిళిసైకి ప్రధాని మోదీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ఎవరిని గవర్నర్‌గా నియమిస్తారనేది చర్చనీయాంశమైంది.
బీజేపీకి చెందిన వ్యక్తిని నియమిస్తారా? లేక పార్టీలకు సంబంధం లేని రిటైర్డ్ అధికారులు, రిటైర్డ్ జడ్జిలను నియమిస్తారా? అనేది హాట్ టాఫిక్‌గా మారింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో సీఎం రెవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ సర్కార్‌ను ఎదుర్కునేందుకు రిటైర్డ్ ఐఏఎస్.. లేదా ఐపీఎస్ అధికారిని కొత్త గవర్నర్‌గా నియమించవచ్చన్న ప్రచారం వినిపిస్తుంది. జనవరిలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
గవర్నర్ తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు.
2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.అయితే రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయా ల్లోకి రావాలని ఆమె ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభకు పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళిసై సౌత్ చెన్నై, తిరునల్వేలి, తూత్తుకూడి లోక్ సభ స్థానాల్లో ఒక స్థానంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.