Site icon vidhaatha

New Couple Dead | తొలిరాత్రే శోభనం గ‌దిలో.. న‌వదంప‌తులు మృతి

New Couple Dead

విధాత: ఆ న‌వ దంప‌తుల పారాణి ఆర‌నేలేదు. ఇంటికి క‌ట్టిన‌ తోర‌ణాలు వాడ‌నేలేదు. పెండ్లికి వ‌చ్చిన బంధువులు ఇంకా ఇండ్ల‌కు వెళ్ల‌నేలేదు. అంత‌లోనే ఘోరం జ‌రిగింది. వివాహ‌మైన మ‌రుస‌టి రోజే న‌వ‌దంప‌తులు హ‌ఠాన్మ‌రం చెందారు. బుధ‌వారం పెండ్లి కాగా, గురువారం శోభ‌నం గ‌దిలో విగ‌త జీవులుగా కనిపించారు. వారి వ‌య‌స్సు కూడా 22, 24 ఏండ్లే. వారి శ‌రీరాల‌పై ఎలాంటి గాయాలూ లేవు.

వారు నిద్రించిన గ‌దికి సరైన వెంటిలేష‌న్ లేక, ఊపిరి అందక గుండెపోటుతో న‌వ‌దంప‌తులు మ‌ర‌ణించిన‌ట్టు పోలీసులు ప్రాథ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. కానీ, ఒకేసారి ఇద్ద‌రు విగ‌త‌జీవులు కావ‌డంపై అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. బ‌ల‌రాంపూర్ ఎస్పీ ప్ర‌శాంత్ వ‌ర్మ వివ‌రాల ప్ర‌కారం..

స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేట‌రీకి మృత‌దేహాలు

ప్ర‌తాప్ యాద‌వ్ (24)కు పుష్ప‌యాద‌వ్ (22)తో బుధ‌వారం వివాహ‌మైంది. యూపీలోని బ‌హ‌ర‌హీచ్‌ జిల్లా క‌సియార్‌గంజ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని గోధియా గ్రామంలో వ‌రుడి గృహం న‌వ‌దంప‌తులు నిద్రించారు. గురువారం ఉద‌యం వారు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో త‌లుపులు విర‌గ్గొట్టి లోప‌లికి వెళ్లి చూడ‌గా, విగ‌త జీవులుగా కనిపించారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా.. ఘ‌ట‌నాస్థ‌లిని పరిశీలించారు. న‌వ దంప‌తుల మృతి మిస్ట‌రీని ఛేదించేందుకు, పూర్తి స్థాయి విచార‌ణ కోసం మృత‌దేహాల‌ను ల‌క్నోలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబోరేట‌రీకి పంపించారు. త‌దుప‌రి ప‌రీక్ష‌ల కోసం అక్క‌డ ఫ్రిజ‌ర్‌లో పెట్టారు.

నవ‌దంపతుల శ‌రీరాల‌పై గాయాలు లేవు

శోభ‌నం గది లోప‌లికి ఇత‌రులు ఎవ‌రూ ప్ర‌వేశించిన‌ట్టు ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేదు. నవ‌దంపతుల శ‌రీరాల‌పై ఎలాంటి గాయాలు కూడా లేవు. ఎలాంటి నేర కోణం కూడా క‌నిపించ‌లేదు. పోస్టుమార్టం రిపోర్టు కూడా గుండెపోటు కార‌ణంగా మ‌ర‌ణించిన‌ట్టు వెల్ల‌డించింది. కానీ, ఇద్ద‌రు ఒకేసారి, ఒకే స‌మయానికి ప్రాణాలు కోల్పోవ‌డం అనుమానాల‌కు తావిస్తున్న‌ది.

బుధ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు ఏమి జ‌రిగిందో టైమ్‌లైన్ ప్రకారం పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. బుధ‌వారం నాడు దంప‌తులు ఏమి తిన్నారు? గ‌దిని ప‌రిశీలించిన ఫోరెన్సిక్ నిపుణుల‌కు ఎలాంటి ఆధారాలు ల‌భించాయి? దంప‌తుల మ‌ర‌ణం వెనుక ఉన్న ప‌రిస్థితుల‌పై అన్నికోణాలు పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

ప్ర‌తాప్, పుష్ప అంత్య‌క్రియ‌ల‌ను ఒకేసారి నిర్వ‌హించారు. ఇద్ద‌రిని ఒకే చితిపై ఉంచి నిప్పంటించారు. నూత‌న వ‌ధూవ‌రులిద్ద‌రి అంత్య‌క్రియ‌ల‌కు గ్రామ‌స్తులు భారీగా త‌ర‌లివ‌చ్చి క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు.

Exit mobile version