Divorce | పెళ్లంటే నూరేళ్ల పంట.. అంతే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది ఒక అపురూప ఘట్టం. బతికున్నంత కాలం ఆ దాంపత్య జీవితం గుర్తుండి పోవాలని ప్రతి జంట కలలు కంటోంది. కానీ కొన్ని జీవితాల్లో ఆ కలలు కలగానే మిగిలిపోతాయి. అది భాగస్వామి పొరపాటు వల్ల కావొచ్చు. ఇంకేదైనా కారణం ఉండొచ్చు.
ఒక భాగస్వామి వల్లే పొరపాటు జరిగి మనస్ఫర్థలు సంభవిస్తే.. విడాకులు తీసుకునే మహిళలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అయితే ఈ విడాకుల విషయాన్ని బయటకు రానివ్వకుండా మనసులోనే దాచుకొనే మహిళలు మరెందరో. సమాజంలో తిరిగేందుకు కూడా భయపడుతుంటారు.
కానీ ఈ మహిళ మాత్రం తన విడాకుల విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. తన భాగస్వామితో విడాకులు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె ప్రకటించింది. అంతే కాదు విడాకుల ఘటనను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించి ఫోటో షూట్ కూడా చేసుకుంది. మరి ఆమె ఎవరో తెలుసుకుందామా..!
షాలిని ఒక ఫ్యాషన్ డిజైనర్. ఆమెకు పెళ్లైంది. కానీ భర్తతో ఎక్కువ కాలం జీవించలేకపోయింది. కొన్ని విబేధాల కారణంగా తన భర్తతో ఆమె విడిపోయింది. అలా అని ఆమె కుంగుబాటుకు లోను కాలేదు. తన భర్తతో విడాకులు తీసుకున్న మరుక్షణమే ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయింది.
ఎరుపు రంగు దుస్తులను ధరించి, చేతిలో డైవర్స్ అనే అక్షరమాలను పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. తన భర్తతో కలిసి దిగిన ఫోటోను చింపేశారు. ఆ ఫోటోను చింపుతున్న దృశ్యాలను కూడా ఆమె పంచుకున్నారు. ఒక ఫ్రేమ్‌ను అయితే ఆమె కాలితో తొక్కారు. ఆ ఫోటోను కూడా షాలిని షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె ఓ సందేశం కూడా ఇచ్చారు. నాకు 99 సమస్యలు ఉన్నాయి. కానీ భర్త ఒక్కటి కాదు. విడాకులు తీసుకున్న మహిళలు గట్టిగా మాట్లాడలేరని భావించే వారికి ఇదో సందేశం. ఇష్టం లేని భాగస్వామి నుంచి విడిపోవడమే సరైంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి అర్హులే.
మీ జీవితాలను మీ చేతుల్లోకి తీసుకోండి. మీ పిల్లలకు మంచి ఫ్యూచర్‌ను ఇవ్వండి. విడాకులు తీసుకోవడం వైఫల్యం కానే కాదు. జీవితానికి ఇది ఒక మలుపు. ఒంటరిగా ఉండాలంటే ఎంతో ధైర్యం కావాలి. కాబట్టి ఒంటరిగా ఉండే మహిళందరికి ఇది అంకితం చేస్తున్నాను అని షాలిని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.