Tragic Honeymoon Trip: హనీమూన్‌కు బయలుదేరిన నవ దంపతుల ప్రయాణం ఆదిలోనే విషాదంగా ముగిసింది. గోవాకు హనీమూన్ వెళ్లేందుకు బయలుదేరిన భార్య కళ్ల ముందే భర్త రైలు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదకర ఘటనతో నవ వధువు తన భర్తను కోల్పోయింది. వైవాహిక జీవితం ఆనందాన్ని ఆస్వాదించాలనుకున్న ఆ జంట కలలను రైలు ప్రమాదం భగ్నం చేసింది. వివరాల్లోకి వెళితే వరంగల్ కు చెందిన ఉరగొండ సాయి(28)కి 3 నెలల క్రితం వివాహమైంది.
హనీమూన్‌కు గోవా వెళ్లడం కోసం శుక్రవారం ఉదయం భార్య, బావమరిది, స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కారు. వాటర్ బాటిల్ కొనేందుకు సాయి వెళ్లగా రైలు బయలుదేరడంతో స్నేహితులు చైన్ లాగారు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు ప్రశ్నించగా సాయి ఫైన్ చెల్లిస్తామని.. వదిలిపెట్టమని కోరుతుండగా రైలు బయలుదేరింది. కంగారులో సాయి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్య పడిపోయి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడు.
కళ్ల ముందే భర్త చనిపోయిన ఘటనను చూసిన భార్య షాక్ తో నిశ్చేష్టురాలైంది. ఈ వ్యవహారంలో పోలీసుల వైఖరి విమర్శలకు గురవుతుంది. నవ దంపతులు హనీమూన్ ప్రయాణం భర్త మరణంతో విషాదాంతం కావడంతో ఆ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.