No-Confidence Motion
విధాత: రాహుల్‌గాంధీపై బీజేపీ సర్కారు తీసుకున్న చర్య విపక్షాలను మరింత ఏకం చేస్తున్నది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పును ఆసరా చేసుకున్న లోక్‌సభ సెక్రటేరియట్.. ఆయనను లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా సోమవారం ప్రతిపక్షాల సభ్యులు నల్ల దుస్తులు ధరించి సభకు హాజరైన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో మరో ఉమ్మడి అడుగుగా విపక్షాలన్నీ కలిసి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు (No-Confidence Motion) ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. స్పీకర్ సభలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, అధికార పక్షాన్ని కొమ్ము కాస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Opposition parties may bring a no-confidence motion against Lok Sabha Speaker Om Birla on Monday. The proposal was kept in a meeting of Congress MPs. Congress is talking to other Opposition parties in this regard: Sources
— ANI (@ANI) March 28, 2023
ఈ నేపథ్యంలో స్పీకర్‌పై ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస నోటీసు ఇవ్వాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. సోమవారం సాయంత్రం వివిధ ప్రతిపక్షాల సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ చర్చ వచ్చినట్టు తెలుస్తున్నది. దీనిపై ప్రతిపక్షాల సభ్యుల నుంచి సంతకాలు సేకరిస్తున్నట్టు సమాచారం. బుధవారం ఈ నోటీసు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.
నీరవ్‌మోదీ.. లలిత్ మోదీ.. నరేంద్రమోదీ.. ఇలా అందరి ఇంటిపేర్లు ఒక్కలానే ఉన్నాయేంటి? దొంగలందరికీ ఒకే ఇంటిపేరు ఉన్నదేంటి? అని రాహుల్ చేసిన వ్యాఖ్యపై గుజరాత్ మంత్రి పూర్ణేశ్ మోదీ కేసు పెట్టగా.. సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడింది.
అదే సమయంలో పార్లమెంటు హౌసింగ్‌ప్యానల్ కూడా రాహుల్‌కు కేటాయించిన అధికార బంగ్లాను ఖాళీ చేయాల్సిందేనని తాఖీదులు ఇచ్చింది. ఈ చర్యలన్నీ ప్రతిపక్షాలను క్రమంగా ఒక్క తాటిపైకి తెస్తున్నాయి. ఈ వివాదానికి ముందు కాంగ్రెస్‌ను పలు విపక్షాలు దూరం పెట్టినా.. తాజా పరిణామాలు ప్రతిపక్షాల మధ్య గట్టి ఐక్యతకు కారణమవుతున్నాయన్న చర్చ జరుగుతున్నది