- స్టార్టప్‌ల్లో కొలువులు కోల్పోయిన వారికీ అవకాశాలిస్తాం
- దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్
విధాత: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గ్లోబల్ కార్పొరేట్ దిగ్గజాలెన్నో వరుసపెట్టి వేలాది మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్న నేపథ్యంలో దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ మాత్రం లేఆఫ్‌ల జోలికే వెళ్లబోమని స్పష్టం చేసింది. పైగా స్టార్టప్‌ల్లో ఉద్యోగాలు కోల్పోయినవారికీ చేయూతనిస్తామని ప్రకటించింది.
ఉద్యోగుల్లో ప్రతిభను పెంచడానికే టీసీఎస్ పెద్దపీట వేస్తుందని, తొలగింపులకు కాదని పీటీఐకిచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆ సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. నిజానికి చాలా కంపెనీలు అవసరానికి మించి నియామకాలు చేపట్టాయని, ఈ క్రమంలో బలవంతంగా ఉద్యోగ కోతలకు దిగుతున్నాయని అన్నారు.
కానీ టీసీఎస్‌కు ఆ అవసరం లేదని, ఉద్యోగ నియామకాల్లో ఆచితూచి వ్యవహరిస్తామని, అందుకే ఒక్కసారి సంస్థలోకి తీసుకుంటే వారికి అన్నిరకాల భరోసానిస్తూ వారి కెరియర్‌ను పెంపొందించే బాధ్యతను భుజాన వేసుకుంటామని చెప్పారు.
ఒకవేళ మేము ఆశించిన స్థాయిలో పనితీరు లేకపోతే సదరు ఉద్యోగులకు మరింత సమయం ఇచ్చి ఇంకా మెరుగైన శిక్షణ అందిస్తామని వివరించారు. గత ఏడాది 2 లక్షలకుపైగా ఉద్యోగులను తీసుకున్నామని, వీరిలో 1.19 లక్షల మంది ట్రైనీలేనని ఈ సందర్భంగా లక్కడ్ తెలిపారు. కంపెనీలో ప్రస్తుతం 6 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు.