Odisha Train Crash | కుట్ర కోణం కట్టుకథే.. కోరమాండల్‌ ప్రమాదంపై రిటైర్డ్‌ ఐపీఎస్‌

<p>తప్పు కప్పిపుచ్చుకునేందుకు అధికారుల ఎత్తుగడ ప్రమాదాలు జరిగినప్పుడు ఇది వారికి మామూలే విధాత : రాజకీయాలకు ప్రమాదాలను కూడా వాడుకోవడం కాషాయ మూకలకే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిశా (Odisha Train Crash) లోని బాలాసోర్‌ వద్ద ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అందులో తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ఏళ్ల తరబడి కవచ్‌ పరిధిలోకి ఈ మార్గాన్ని తేవకపోవడం వంటి కీలక అంశాలు ఈ ప్రమాదానికి కారణంగా నిలుస్తున్నాయి. కానీ.. ఈ […]</p>

విధాత : రాజకీయాలకు ప్రమాదాలను కూడా వాడుకోవడం కాషాయ మూకలకే చెల్లిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిశా (Odisha Train Crash) లోని బాలాసోర్‌ వద్ద ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అందులో తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ఏళ్ల తరబడి కవచ్‌ పరిధిలోకి ఈ మార్గాన్ని తేవకపోవడం వంటి కీలక అంశాలు ఈ ప్రమాదానికి కారణంగా నిలుస్తున్నాయి.

కానీ.. ఈ ప్రమాదంలో కుట్ర కోణం అనేది బలవంతంగా రుద్దుతున్న అంశంగానే పరిగణించాలని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు. సంఘ్‌పరివార్‌ శక్తులు ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నదని చెప్పడం రాబోయే ఎన్నికల్లో ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టేందుకే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రజలపై కుట్ర కోణం రుద్దే యత్నం

ఈ అంశంపై.. దీర్ఘకాలం ఒడిశాలో పనిచేసిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఎం నాగేశ్వర్‌రావు ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. కుట్ర కోణాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలను వ్యక్తం చేశారు. పూర్తి అభూత కల్పనలతో, మతపరమైన కోణాలను దట్టించి కాషాయ మూకల ఐటీ సెల్‌ పెయిడ్‌ ఆర్టిస్టులు దీనిని ప్రచారంలోకి తెస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజల దృష్టి మళ్లించడానికే

తాను ఒడిశాలో రెండు రైల్వే పోలీస్‌ జిల్లాలకు ఎస్పీగా పనిచేశానని, ఒడిశా రైల్వే పోలీస్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా కూడా పనిచేశానని తెలిపారు. తనకు ఉన్న అనుభవం మేరకు.. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తమ వ్యవస్థలోని లోపాలు, వారి అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్ర కోణాలు బయటకు తీయడం రైల్వే అధికారులకు పరిపాటేనని ఆయన పేర్కొన్నారు.

కుట్ర కోణం పేరుతో నివేదిక వచ్చే నాటికి ప్రజలు ఆ ఘటననే మర్చిపోతారని అన్నారు. ప్రజాగ్రహం నుంచి తప్పించుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల నేతలు కూడా ఇది చాలా సౌకర్యవంతమైన ఎత్తుగడ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రత్యేకించి మరో ఏడాదిలోపే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయని పేర్కొన్న నాగేశ్వర్‌రావు.. కుహనా హిందూత్వ శక్తులు హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అందివచ్చిన ప్రతి సందర్భాన్నీ ఉపయోగించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఒడిశా రైలు ప్రమాదాన్ని మతపరమైన ప్రచారాల వలలో పడవద్దని హిందూ సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు.