- గ్రామపంచాయతీ కార్యాలయం ముట్టడి
- పోరాటానికి 5 గ్రామాల ప్రజలు కలసి రావాలని ఆందోళనకారుల బహిరంగ లేఖ
- పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కావంటున్న అధికార వర్గాలు
- ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదంటున్న ప్రభుత్వ వర్గాలు
విధాత బ్యూరో, కరీంనగర్: ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పాశిగామలో ప్రారంభమైన ఆందోళన క్రమేపి వెలగటూర్ మండలానికి విస్తరిస్తోంది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ.. ఎలా తీర్మానించారని ప్రశ్నిస్తూ స్తంభంపల్లి గ్రామస్తులు ఆదివారం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి సర్పంచ్ ని నిలదీశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామపంచాయతీ పరిధిలోని 1090 సర్వేనెంబర్‌లో గల 115 ఎకరాల భూమిలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని సర్పంచ్ చల్లూరి రూపారాణి అధ్యక్షతన సమావేశమైన పంచాయతీ పాలకవర్గం 2022 మే 27వ తేదీన తీర్మానం ఆమోదించింది. ఈ సమావేశానికి సర్పంచ్ రూపారాణితో పాటు, ఉప సర్పంచ్ పాదం లక్ష్మి, వార్డు సభ్యులు గోరువంతల రవి, సంగెపు రాజమ్మ,
తోగిటి సుమలత హాజరు కాగా, దుబ్బ స్వామి, పి శ్రీలత, పి అనూష, చింతల వెంకటేష్, జక్కుల రవి, నందగిరి రాజయ్య గైర్హాజర్ అయ్యారు.
అయితే గ్రామసభ నిర్వహించకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అభ్యంతరం లేదని ఎలా తీర్మానిస్తారంటూ ప్రజలు సర్పంచ్‌ను ప్రశ్నించారు. గ్రామస్తులంతా ఏకం కావడంతో ఈ తీర్మానాన్ని రద్దు చేయడానికి తనకు అభ్యంతరం లేదని సర్పంచ్ వారికి హామీ ఇచ్చారు.
పాశిగామలో కొనసాగుతున్న ఆందోళనలు
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకునే విషయంలో వెనక్కి తగ్గేది లేదని పాశిగామ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. గత మూడు రోజులుగా వారు గ్రామంలోనే తమ నిరసన కొనసాగిస్తున్నారు.
మరోవైపు అధికార పార్టీకి చెందిన గ్రామ శాఖ అధ్యక్షుడితోపాటు సుమారు 200 మంది పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గ్రామంలో అధికార పార్టీకి చెందిన జండా గద్దెలను కూల్చివేసేందుకు స్థానికులు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.
ఈ పరిశ్రమ కారణంగా కాలుష్యం బారిన పడే స్తంభంపల్లి వెంకటాపూర్, వెల్గటూర్, కుమ్మరిపల్లి, కొత్తపల్లి గ్రామాల ప్రజలకు పాశిగామ ఆందోళనకారులు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ పరిశ్రమ ప్రారంభం అయితే పర్యావరణ, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వారీ లేఖలో పేర్కొన్నారు.
ఫ్యాక్టరీ కారణంగా భవిష్యత్ తరాలు నష్టపోకుండా నిర్మాణం పనులను అడ్డుకోవలసిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పార్టీలు పదవులకు అతీతంగా తాము చేపట్టిన ఆందోళనలకు మిగిలిన గ్రామాల ప్రజలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని, ఐదు గ్రామాల ప్రజల జీవన్మరణ సమస్య అయినందున పోరాటమే శరణ్యమని పేర్కొన్నారు.
ఇదీ నేపథ్యం…
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఇథనాల్ కర్మాగారం ఏర్పాటు కోసం మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర పురపాలక ఐటి శాఖల మంత్రి కే తారక రామారావు, నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ ( KRIBHCO) కంపెనీతో సంప్రదింపులు జరిపారు.
అనంతరం ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో వెల్గటూర్ మండలం స్తంభం పల్లి సమీపంలోని 413 ఎకరాల స్థలాన్ని పరిశీలించి అక్కడే ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు.
700 కోట్లతో క్రిప్కో ఈ ఫ్యాక్టరీ నిర్మించనుంది.
ప్లాంట్ మొదటి దశలో రోజుకు 250 కిలోల కార్న్ బ్రాన్ ఆయిల్, రెండో దశలో 250 కిలోల రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేయనుంది. దీనికోసం ప్రతి ఏటా 5 లక్షల టన్నుల వరి, మొక్కజొన్న అవసరం. ఇథనాల్ ను మద్యం, బయో డీజిల్, ఫార్మా తయారీ యూనిట్లలో ఉపయోగిస్తారు.
పర్యావరణ ఇబ్బందులు లేవు..
ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఓవైపు ప్రజాందోళన కొనసాగుతుండగా, ప్రభుత్వ వర్గాలు మాత్రం.. దీనివలన ఎలాంటి పర్యావరణ చిక్కులు ఉండబోవని చెప్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందని అంటున్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి పర్యావరణ పరమైన అనుమతులన్నీ ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదని చెబుతున్నారు.