Site icon vidhaatha

BRS | పొంగులేటి టార్గెట్‌గా ఆపరేషన్ గులాబీ.. అనుచరులకు టికెట్ల ఆఫర్

BRS |

పువ్వాడతో రాయ బేరాలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్యలకు గాలం

విధాత: సీఎం కేసీఆర్ ను సవాల్ చేసిన ఖమ్మం మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా ఆపరేషన్ గులాబీ జోరందుకుంది. ఖమ్మంతో పాటు రాష్ట్రంలోనూ బీఅరెస్ ను గెలవనివ్వనంటూ సవాల్ చేసిన పొంగులేటిని రాజకీయంగా మట్టి కరిపించేందుకు కేసిఆర్ సైలెంట్ ఆపరేషన్ చేస్తున్నారని ఖమ్మం గులాబీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఖమ్మంలో పొంగులేటి ఆయన అనుచరులు పార్టీని వీడటం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎదురయ్యే నష్టాన్ని పూడ్చుకునేందుకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వారా అన్ని మార్గాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో ప్రధానంగా పొంగులేటి వెన్నుదన్నుగా ఉండే అనుచరులకే గాలం వేసి వారికి బీఆరెస్ ఎమ్మెల్యేల టికెట్లు ఎరవేస్తున్నారన్న ప్రచారం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరిన ఆయన అనుచరుడు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్యలను తిరిగి కారెక్కించి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామంటూ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే పువ్వాడ గప్ చుప్ గా వెంకట్రావు, కనకయ్యలను వెంటబెట్టుకొని సీఎం కేసీఆర్ ను, హరీశ్రావును కలిసి మంతనాలు చేసినట్లుగా తెలుస్తుంది.

తెల్లం వెంకట్రావుకు భద్రాచలం బీఆరెస్ టికెట్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. కాంగ్రెస్ లో ఉంటే భద్రాచలం టికెట్ సీటింగ్ ఎమ్మెల్యే పోదిం వీరయ్యకే వస్తుందని బీఆరెస్ లో చేరితే ఆ స్థానం కేటాయిస్తామంటూ తెల్లంకు గులాబీ బాస్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతుంది.

మొత్తం మీద తనను సవాల్ చేసిన పొంగులేటిని రాజకీయంగా గట్టి దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఖమ్మం రాజకీయాలపై సీరియస్ గానే దృష్టి పెట్టారు. మూడోసారి అధికారంలో రావడానికి ఖమ్మంలో సగం స్థానాలైనా దక్కించుకోవాల్సిన అవసరాన్ని కూడా కేసీఆర్ గుర్తించారు.

అటు తనను లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ కదుపుతున్న రాజకీయపావులను పొంగులేటి ఏ విధంగా ఎదుర్కొంటారు.. తన అనుచరులు చేజారిపోకుండా ఏం చేస్తారన్నది ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Exit mobile version