విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడవ పర్యాయం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓరుగల్లు అనూహ్యఫలితాలను రికార్డు చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్, కేవలం రెండు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించాయి.
ఫలితాల సరళిని పరిశీలిస్తే పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్ధి మామిడాల యశస్విని రెడ్డి చేతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్ లో కాంగ్రెస్ అభ్యర్ధి రామచంద్రునాయక్ మధ్య జరిగిన పోటీలు ఎమ్మెల్యే రెడ్యానాయక్, కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ మురళీనాయక్ చేతిలో శంకర్ నాయక్, కాంగ్రెస్ అభ్యర్ధి దొంతి మాధవరెడ్డి మధ్య జరిగిన పోటీలో పెద్ది సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి కెఆర్ నాగరాజు చేతిలో అరూరి రమేష్, కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర సత్యనారాయణరావు చేతిలో గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమిపాలయ్యారు.
ములుగులో కాంగ్రెస్ అభ్యర్ధి ధనసరి అనసూయ సీతక్క బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి పై విజయం సాధించారు. పరకాలలో చల్ల ధర్మారెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్ధి రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ తూర్పులో బీజేపీ అభ్యర్ధి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పై కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమలో దాస్యం వినయ్ భాస్కర్ పై కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి సింగపురం ఇందిర పై బీఆర్ఎస్ అభ్యర్ధి కడియం శ్రీహరి, జనగామలో కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పై బీఆర్ఎస్ అభ్యర్ధి పల్లారాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.
కాంగ్రెస్ అనూహ్యఫలితాలు
ఈ ఎన్నికల ఫలితాల్లో అనేక విశేషాలు, వింతలు, షాకింగ్ రిజల్ట్ కు కేంద్రంగా ఈ ఎన్నికలు నిలిచాయి. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నాయకులు, వరుస విజయాలను నమోదు చేసిన నేతలు కాంగ్రెస్ అభ్యర్ధుల చేతిలో ఓటమిపాలయ్యారు. పార్టీ మార్చిన అభ్యర్ధికి ఈ సారి ఓటర్లు ఓటమి రుచిచూపించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా ఈ ఎన్నికల్లో అభ్యర్ధును మార్చిన రెండు స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు పొందిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ మరోసారి పునరావృతమైంది. రెండు మూడు స్థానాలు మినహా 10 వరకు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఏకపక్షంగా తీర్పు ఇవ్వకుండా ప్రతిపక్షపార్టీకి సైతం స్థానం కల్పించడం విశేషం.
తలపండిన నేతల ఓటమి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోటీచేసిన తలపండిన నాయకుల్లో కడియం శ్రీహరి తప్ప మిగిలిన వారంతా ఓటమి చవిచూశారు. పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, డోర్నకల్ నుంచి డీఎస్ రెడ్యానాయక్, వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియంశ్రీహరి, గుండె విజయరామారావులు ఏడవసారి ఎమ్మెల్యేలుగా పోటీపడ్డారు. తలపండిన ఈ నాయకులు యువనాయకుల చేతిలో ఓటమిపాలు కావడం గమనార్హం.
పాలకుర్తిలో ఎర్రబెల్లి, తొలిసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేస్తున్న మామిడాల యశస్వినిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి తొలిసారి ఓటమి చవిచూశారు. డోర్నకల్ లో రెడ్యానాయక్ యువ నాయకుడు డాక్టర్ రామచంద్రునాయక్ చేతిలో ఓటమిపాలయ్యారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన డాక్టర్ గుండె విజయరామారావు ఓడిపోయారు. ఇక్కడ ఆరవసారి పోటీచేసిన కడియం శ్రీహరి గెలుపొందారు.
మూడు చోట్ల అనూహ్యఫలితాలు
ఉద్దండులుగా పేరొందిన ఎర్రబెల్లి, రెడ్యా, వినయ్ ల పై గెలిచిన వారిలో యశస్వినిరెడ్డి రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి కొత్తకాగా, తొలిసారి కాంగ్రెస్ నుంచి టికెట్ పొందిన నాయిని రాజేందర్ రెడ్డి విజయం సాధించగా గత ఎన్నికల్లో ఓటమిపాలైన రామచంద్రు నాయక్ ఈ దఫా గెలుపొందడం ఆసక్తికరమైన పరిణామంగా చెప్పవచ్చు.
ఫిరాయింపుదారు గండ్రకు ఓటమి
గత ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన గండ్ర వెంకటరమణారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర సత్యనారాయణరావు చేతిలో ఓటమిపాలయ్యారు. పార్టీలు మారిన నేతగా, పలుమార్లు ఓటమిపాలైన నాయకునిగా పేరొందిన గండ్ర సత్యనారాయణ రావుకు ఈ దఫా అన్ని రకాలుగా కలిసొచ్చినట్లు భావిస్తున్నారు. సానుభూతితో పాటు కాంగ్రెస్ పార్టీ గాలి కూడా ఈ సారి సత్యనారాయణరావుకు అనుకూలంగా మారగా, పార్టీ మారిన గండ్ర రమణారెడ్డికి ఈ సారి షాకిచ్చినట్లుగా భావిస్తున్నారు.
రెండింట మార్పు కలిసొచ్చిందా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో జనగామ జిల్లా పరిధిలోని జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్యలకు ఈ సారి టికెట్ దక్కలేదు.
అభ్యర్ధుల మార్పుతో జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలకు అవకాశం కల్పించగా వారిద్దరు విజయం సాధించడం ఆసక్తికరపరిణామంగా చెప్పవచ్చు. వ్యతిరేకత నెలకొన్న సిట్టింగుల్లో మార్పులు చేస్తే బీఆర్ఎస్ కు కొంత సానుకూల ఫలితాలొచ్చే అవకాశముండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తొలిసారి గెలుపొందిన అభ్యర్ధులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో కాంగ్రెస్ అభ్యర్ధులు మెజార్టీ ఉండగా బీఆర్ఎస్ నుంచి ఒక్కరు మాత్రమే ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో డోర్నకల్ నుంచి జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ నుంచి డాక్టర్ మురళీనాయక్, పాలకుర్తి నుంచి మామిడాల యశస్వినిరెడ్డి, వర్ధన్నపేట నుంచి కెఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావు, జనగామ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు.
గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా, గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డి తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొనగా వరంగల్ తూర్పులో మాత్రం తొలి నుంచి బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం.