Pakisthan Monkey
విధాత: పాకిస్థాన్ (Pakistan) కోర్టులో ఒక పిల్ల కోతి అల్లరికి న్యాయమూర్తులు, న్యాయవాదులు గందరగోళానికి గురయ్యారు. దానిని పట్టుకునే వరకు భయం భయంగా బిక్కుబిక్కుమంటూ విధులను ఆపేశారు. అటవీ జంతువుల స్మగ్లింగ్ ముఠా నుంచి పోలీసులు 14 కోతుల (Monkeys) ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆ నిందితులకు కరాచీ కోర్టులో విచారణ ఉంది. దీంతో సాక్ష్యానికి అటవీ శాఖ అధికారులు ఆ 14 కోతులను బోనులో పెట్టి కోర్టులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఒక పిల్ల కోతి ఎలా తప్పించుకుందో గాని ఆ గుంపును వదిలేసి బయటకు వచ్చేసింది.
అటూ ఇటూ పరిగెత్తి ఒక చెట్టుపై చేరింది. అది పిల్ల కావడంతో ఏ వలకూ దొరకకుండా తప్పించుకునేది. చాలా వేగంగా దూకుతుండటంతో అధికారులకు తలకు మించిన భారమైంది. ఆఖరికి 20 గంటల పాటు కష్టపడి దానిని అధికారులు పట్టుకున్నారిన డాన్ పత్రిక వెల్లడించింది.
అనంతరం కోర్టులో విచారణ జరగడంతో జంతువుల స్మగ్లింగ్‌కు పాల్పడిన నిందితులు ఒకొక్కరికి రూ.లక్ష (పాక్ రూపాయలు) జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అలాగే ఈ కోతులను కరాచీ జూకి అప్పగించాలని.. వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలని జూ అధికారులను ఆదేశించారు. మరోవైపు అన్ని కోతులను ఊపిరాడకుండా ఒకే బోనులో తీసుకురావడంతో అటవీ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాక్ జూలు అంటే నరకమే..
అయితే కోతులను జూకు అప్పగించాలనడంపై పాక్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ జూలు నరకానికి నకలు లాంటివని.. అక్కడి వారికి వీటిని సంరక్షించడంపై శ్రద్ధ ఉండదని జంతు ప్రేమికులు వాపోయారు. కోతుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. కోతుల అక్రమ రవాణాపై కఠిన చట్టాలున్నప్పటికీ పాక్‌లో వీటి రవాణ నిత్యకృత్యంగా జరుగుతూనే ఉంటుంది. వీటిని రోడ్డుపై ఆటలాడించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్నిముఠాలు చోరీలు చేసేలా వీటికి శిక్షణ ఇచ్చి ఇళ్ల మీదకు వదులుతాయి