Site icon vidhaatha

Palamuru Lift Irrigation l వచ్చే ఖరీఫ్‌ నుంచే పాలమూరు ఎత్తిపోతలు

Palamuru Rangareddy Lift Irrigation

విధాత : వ‌చ్చే ఖ‌రీఫ్ సీజ‌న్‌లో పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Lift Irrigation Project) నుంచి నీటిని ఎత్తిపోయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి త‌గ్గ‌ట్లుగా విద్యుత్తు ఆవ‌శ్య‌క‌త‌పై డిస్కం(Discoms)లు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నాయి. క్షేత్ర‌స్థాయిలో ప‌నుల్లో పురోగ‌తి ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఇంధ‌న శాఖ త‌ర‌పున యంత్రాంగం సిద్ధ‌మ‌వుతోంది. ఒక్కొక్క‌టి 145 మెగావాట్ల సామ‌ర్ధ్యం ఉన్న బాహుబ‌లి పంపుల‌ (Bahubali motors)ను పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో వినియోగిస్తున్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని (Kaleswaram Lift Irrigation Project) ప్యాకేజీ 6లో 124.5 మెగావాట్లు, ప్యాకేజీ 8 లో 139 మెగావాట్ల సామ‌ర్థ్యం ఉన్న పంపులు వినియోగంలో ఉన్నాయి. ఈ పంపుల‌నే బాహుబ‌లి పంపులుగా చెబుతున్నారు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంత‌కు మించిన సామ‌ర్థ్యంతో 145 మెగావాట్ల పంపుల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఇంధ‌న శాఖ ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం వచ్చే జూలైలో 116 మెగావాట్లు పాల‌మూరు ప‌థ‌కానికి అవ‌స‌రం. శ్రీశైలం బ్యాక్‌వాట‌ర్‌లో నార్లాపూర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన పంపుహౌజ్ నుంచి నీటిని ఎత్తిపోయాలి. ఈ నీటితోనే ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, రంగారెడ్డి జిల్లాలోని 12 ల‌క్ష‌ల ఎక‌రాలు, న‌ల్ల‌గొండ జిల్లాలోని 3 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా సాగునీరు, హైద‌రాబాద్‌కు తాగునీటిని ఇవ్వాల్సి ఉంది. కేసుల బాలారిష్టాల్లో చిక్కుకుని ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల్లో వేగం త‌గ్గింది. ఇటీవ‌లే ప్రాజెక్టు నుంచి తాగునీటి ప‌నులు చేసుకోవ‌డానికి న్యాయ‌స్థానం అనుమ‌తి ల‌భించిన ద‌రిమిలా జూలైలో నీటి ఎత్తిపోత‌ల ప్రారంభిస్తారో లేదో వేచిచూడాలి.

Exit mobile version