Kodangal Lift Irrigation Project | కదలికల్లేని కొడంగల్ లిఫ్ట్.. పరిహారం కోసం రైతుల ఉద్యమ బాట

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు, తాగు నీరు లేక అత్యంత దుర్బర పరిస్థితిలో ఉన్న ప్రాంతాలు కొడంగల్, నారాయణ పేట, మక్తల్ నియోజకవర్గాలు. ఈ మూడు నియోజకవర్గాల్లో పొలాలు బీళ్ళుగా మారిపోయాయి. సాగు నీరు అందించే నేత కోసం ఇక్కడి రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు.

  • Publish Date - August 9, 2025 / 02:00 AM IST

Kodangal Lift Irrigation Project | (విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి) | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు, తాగు నీరు లేక అత్యంత దుర్బర పరిస్థితిలో ఉన్న ప్రాంతాలు కొడంగల్, నారాయణ పేట, మక్తల్ నియోజకవర్గాలు. ఈ మూడు నియోజకవర్గాల్లో పొలాలు బీళ్ళుగా మారిపోయాయి. సాగు నీరు అందించే నేత కోసం ఇక్కడి రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో నేతలకు ఈ కొడంగల్ లిఫ్ట్ ఎన్నికల హామీగా బాగా పనికి వచ్చింది. గద్దెనెక్కిన అనంతరం కొడంగల్ లిఫ్ట్ ఊసే ఎత్తడం మరిచిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం హామీలు ఇచ్చిన నేతలు గెలిచిన తరువాత ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఈ లిఫ్ట్ నిర్మాణం పై కొంచం కదలిక తెచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ.. గత ఏడాది శంకుస్థాపన చేసినా.. ప్రస్తుతం పనులు ఎక్కడికక్కడే పడి ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ఎత్తిపోతల పథకం కారణంగా భూములు కోల్పోతున్న రైతులు.. నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ ఉద్యమబాట పట్టారు. అయితే.. రైతుల డిమాండ్‌ మేరకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ఢపడకపోవడంతో సమస్య జటిలంగా మారింది. ఫలితంగా లిఫ్ట్‌ పనులకు ఆటంకం ఏర్పడటంతో.. అధికారులు సర్వే చేసి చేతులు దులిపేసుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లిఫ్ట్ కు రూపకల్పన :

ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజం పడింది. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఈ లిఫ్ట్ నిర్మాణం కోసం 69 జీవో విడుదల చేశారు. బీమా ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుని ఈ కొడంగల్ లిఫ్ట్ ద్వారా ఎత్తిపోయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, బీఆరెస్‌ అధికారంలోకి రావడం, కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. కానీ.. కొడంగల్‌ లిఫ్ట్‌ విషయాన్ని తొక్కిపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన అలైన్‌మెంట్‌ తప్పుల తడక, బీమా ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవడం కుదరదని అంటూ పాతరేశారు. దాని స్థానంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉద్ధండాపూర్ వద్ద నిర్మిస్తున్న జలాశయం నుంచి నీటిని వాడుకుని కొడంగల్ లిఫ్ట్‌కు అందిస్తామని ప్రకటించారు. అయితే.. ఇది ఆచరణ సాధ్యం కాదని నీటిపారుల అధికారులు తేల్చి చెప్పారు. ఆ తర్వాత మళ్లీ కేసీఆర్‌ తన పదేళ్ల పాలనా కాలంలో ఈ ప్రాజెక్టు ఊసెత్తింది లేదు. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రికి చెప్పేందుకు సాహసం చేయలేకపోయారన్న అభిప్రాయాలు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ ప్రాజెక్టుకు మళ్లీ రెక్కలొస్తాయని అంతా ఆశపడ్డారు. ఈ లిఫ్టు కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలోనే ఉన్నది. అయితే.. రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి.. నిధులు కేటాయించారు కానీ.. పలు గ్రామాల్లో ఇంకా నష్టపరిహారాలు అందకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.

లిఫ్ట్ నిర్మాణం ఇలా !

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట, కొడంగల్‌, మక్తల్‌ నియోజకవర్గాల్లోని 1.05 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు నారాయణపేట జిల్లా తాగునీటి అవసరాలు తీర్చడానికి రెండు దశల్లో ఈ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఈ పథకం కింద చెరువుల నిల్వ సామర్థ్యాన్ని 0.9 టీఎంసీలతో ప్రతిపాదించగా తాజాగా నాలుగు టీఎంసీలకు పెంచారు. భీమా ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని భూత్పూర్‌ జలాశయానికి తరలిస్తారు. ఇక్కడి నుంచి కనుకుర్తి వరకు మూడు చోట్ల నీటిని లిఫ్ట్‌ చేసేలా మొత్తం రెండు దశల్లో ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయించారు. ఒకటో ప్యాకేజీని తొలి దశలో భూత్పూర్‌ జలాశయం నుంచి ఉట్కూరు చెరువు, రెండో ప్యాకేజీలో జయమ్మ చెరువుకు, అక్కడి నుంచి కానుకుర్తి గ్రామ చెరువు దాకా నీటిని పంపింగ్‌ చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో ఉట్కూరు, జయమ్మ, కానుకుర్తి చెరువుల ఆధునీకరణ, నీటి నిల్వ పెంచడానికి వీలుగా ఈ మొదటి దశ పనులకు రూ.2945 కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండో దశలో జాజాపూర్‌, దౌలతాబాద్‌, బొమ్మరాస్ పేట, లక్ష్మీపూర్‌, ఎర్లపల్లి, హుస్నాబాద్‌, కొడంగల్ ప్రాంత చెరువుల సామర్థ్యాన్ని పెంచుతారు. గ్రావిటీ కాల్వలు, ఆయకట్టుకు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు రూ.1404.50 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ చెరువుల ద్వారా ఈ మూడు నియోజకవర్గం లోని 1.05 లక్షల ఎకరాల పంట పొలాలకు సాగునీరు, అలాగే 0.38 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేసి నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటిని అందించాల్సి ఉన్నది. రాజీవ్‌ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన భూత్పూర్‌ జలాశయం నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పథకానికి 2024-25 బడ్జెట్‌లో రూ.610 కోట్లు కేటాయించారు. ఇదివరకే ఈ లిఫ్ట్ నిర్మాణం పనుల కోసం లైడార్ సర్వే పూర్తి అయింది.

పరిహారం కోసం రైతుల ఉద్యమం :

కొడంగల్ లిఫ్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఎకరాకు రూ.14 లక్షలు ఇస్తామని ముందుగా ప్రకటించింది. ఇది చాలా తక్కువ అంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన సమయంలో రైతుల ఆందోళనపై స్పందించారు. ఎకరాకు రూ. 20 లక్షలు ఇస్తామని, రైతులను కడుపులో పెట్టుకుని చూసే బాధ్యత తనదని చెప్పారు. అయితే.. ఎకరాకు రూ. 40 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సర్కార్‌ నుంచి ఇప్పటి వరకూ స్పందనలేదు. దీంతో లిఫ్ట్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇన్నేళ్లు లిఫ్ట్ పట్టిన గ్రహణం ఎప్పుడు వీడుతుందో అని ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. కొడంగల్‌ నుంచి ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి ఉండగా, తాజాగా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. మరో కీలక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మూడు నియోజకవర్గల్లో బలమైన నేతలు ఉన్నా కొడంగల్ లిఫ్ట్ పనులు ముందుకు కదలడం లేదు.