Budget Session | పార్లమెంటు ఉభయసభలు.. నిరవధిక వాయిదా

విధాత: పార్లమెంట్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులతో విలువైన సభా సమయం వృథా అయ్యింది. రోజువారీ వాయిదాలు, సభా కార్యక్రమాలకు ఆటంకాలు కలిగించడంతో పార్లమెంటు రెండో విడుత సమావేశాలు నిర్దేశించిన గంటల కంటే చాలా తక్కువ సమయం మాత్రమే సభలు సాగాయి. బడ్జెట్‌ రెండో విడుత సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి నిరంతర వాయిదాతోనే కాలం గడిచింది. ఈరోజు కూడా సభ ప్రారంభం కాగానే అదే సీన్‌ రిపీట్‌ అయింది. నేడు సభ నిరవధికంగా వాయిదా బడ్జెట్‌ సమావేశాలు […]

  • Publish Date - April 6, 2023 / 12:57 PM IST

విధాత: పార్లమెంట్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులతో విలువైన సభా సమయం వృథా అయ్యింది. రోజువారీ వాయిదాలు, సభా కార్యక్రమాలకు ఆటంకాలు కలిగించడంతో పార్లమెంటు రెండో విడుత సమావేశాలు నిర్దేశించిన గంటల కంటే చాలా తక్కువ సమయం మాత్రమే సభలు సాగాయి.

బడ్జెట్‌ రెండో విడుత సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి నిరంతర వాయిదాతోనే కాలం గడిచింది. ఈరోజు కూడా సభ ప్రారంభం కాగానే అదే సీన్‌ రిపీట్‌ అయింది. నేడు సభ నిరవధికంగా వాయిదా బడ్జెట్‌ సమావేశాలు (Budget Session) ముగించారు.

ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలన్నీ ఆందోళన చేపట్టాయి. ప్లకార్డు ప్రదర్శిస్తూ… వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సభాపతి ఓం బిర్లా వారించినప్పటికీ విపక్ష ఎంపీలు ఎంతకూ వినకపోవడంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ప్రకటించారు.

విపక్ష సభ్యుల ప్రవర్తన సభా గౌరవాన్ని తగ్గించేలా ఉన్నదని.. నిత్యం సభాకార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు. తమ తమ సీట్లలో కూర్చోవాలన్న సభా పతి అభ్యర్థనను పట్టించుకోని ఎంపీలు నిరసనలు కొనసాగించారు. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. అటు రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడానికి మీరంటే మీరు కారణమంటూ..అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.

రూ. 50 లక్షల కోట్ల బడ్జెట్‌ 12 నిమిషాల్లో ఆమోదం: ఖర్గే

లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గురించి ఎన్నో మాటలు చెబుతుంది. కానీ అందుకు తగినట్లు నడచుకోదన్నారు. రూ. 50 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను 12 నిమిషాల్లో ఆమోదించారు. సమావేశాల పట్ల ప్రతిపక్షాలకు ఆసక్తి లేదని, అందుకే అడ్డుకుంటున్నాయని అధికారపార్టీ అంటున్నది. కానీ ప్రభుత్వం వల్లనే సమావేశాలకు అంతరాయం ఏర్పడిందని, ఇలా జరగడం మొదటిసారి అని ఖర్గే అన్నారు.

పార్లమెంటును విపక్ష సభ్యులు అవమానించారు: కిరణ్‌ రిజుజు

పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల వైఖరిని తప్పపడుతూ.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు తప్పుడు పద్ధతుల ద్వారా సమావేశాలను అడ్డుకున్నాయి. విపక్ష సభ్యులు నల్ల దుస్తులతో సమావేశాలకు హాజరై పార్లమెంటును మళ్లీ అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది దురదృష్టకరమైన ఘటనగా భావిస్తున్నామన్నారు. సభ గౌరవప్రతిష్టలను పెంచాలని అనుకున్నామని కానీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కోసం కాంగ్రెస్‌ పార్టీ, ఇతర విపక్షాలు చేసిన రాద్ధాంతాన్ని దేశమంతా చూసింది. ప్రజలంతా చూశారని మంత్రి తెలిపారు.

లోక్‌సభ 45 గంటలు.. రాజ్యసభ 35 గంటలు

లెక్కల ప్రకారం లోక్‌సభ సమావేశాలు 133.6 గంటలు పనిచేయాల్సి ఉండగా.. 45 గంటలు మాత్రమే సాగాయి. అటు రాజ్యసభ కూడా 130 గంటలు పని చేయాల్సి ఉండగా.. 35 గంటలే పనిచేసినట్లు వెల్లడించారు. మొత్తం బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో లోక్‌సభ సమయం 4.32 గంటలు కాగా, రాజ్యసభలో 1.82 గంటలే నని గణాంకాలు వివరిస్తున్నాయి.

సాధారణ బడ్జెట్‌ లోక్‌సభ 14. 5 గంటలపాటు చర్చ జరిగిందని, 145 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం 13 గంటలు సాగిందని.. 143 మంది ఎంపీలు పాల్గొన్నారని వెల్లడించారు. లోక్ సభలో 8 బిల్లులు ప్రవేశపెట్టగా అందులో 6 ఆమోదం పొందాయని పేర్కొన్నారు. 29 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిపారు.

Latest News