Waqf Amendment Bill | ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం.. వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 4, 2025తో ముగియనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముందుకు తీసుకురానున్నది. బిల్లు ఆమోదానికి తగిన సంఖ్యాబలం ఉంటుందని కేంద్ర విశ్వాసంతో ఉన్నా.. ఎన్డీయేలోని కీలక భాగస్వామ్య పక్షం జేడీయూ మద్దతుపై ఇంకా స్పష్టత లేదు. దీంతో బిల్లు ఆమోదంపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నాయి.
బిల్లు ఆమోదానికి ఎన్ని ఓట్లు కావాలి?
542 మంది సభ్యులున్న లోక్‌సభలో వక్ఫ్ బిల్లు ఆమోదానికి కనీసం 272 మంది మద్దతు అవసరం. అధికార ఎన్డీయే కూటమికి కీలక పక్షం జేడీయూకు చెందిన 12 మంది సహా 293 మంది సభ్యులు ఉన్నారు. అలా చూసినప్పుడు ఎన్డీయే సులభంగానే బిల్లును ఆమోదించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ బిల్లుపై జేడీయూలో తలో విధంగా మాట్లాతున్నారు. దీంతో జేడీయూ మద్దతు ఉంటుందా? లేదా? అన్న చర్చ ఊపందుకున్నది. జేడీయూ సీనియర్ నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇది వక్ఫ్ బోర్డు పనితీరులో పారదర్శకత తీసుకురావడంలో కీలకంగా ఉంటుందని అంటున్నారు. అంతేకానీ.. ఇది ముస్లిం వ్యతిరేక బిల్లు కాదని ఘంటాపథంగా చెబుతున్నారు. మరోవైపు జేడీయూ ఎమ్మెల్సీ గులాం గౌస్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది మైనార్టీల అవమానకరమైన బిల్లు అని తేల్చి చెబుతున్నారు. వక్ఫ్ అమెండ్‌మెంట్ వంటి విధానాలతో బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మైనార్టీలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘వక్ఫ్ సవరణ బిల్లును మొట్టమొదట వ్యతిరేకించిన వ్యక్తిని నేనే. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ కొన్నిసార్లు లవ్ జిహాద్, సీఏఏ, మూకుమ్మడి ఊచకోతలు, ట్రిపుల్ తలాఖ్, ఇప్పుడు ఇది. ఇది మా మతపరమైన అంశం. మా హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు’ అని పేర్కొన్నారు. జేడీయూ కనుక మద్దతు ఉపసంహరిస్తే ఎన్డీయే మెజార్టీ ప్రమాదంలో పడుతుంది. ఫలితంగా బిల్లుపై మరింత విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. లోక్‌సభలో 12 మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో జేడీయూ వైఖరి అత్యంత కీలకం కానున్నది. ఎన్డీయే మెజార్టీకి ఇదొక ముఖ్యమైన పార్టీ. 293 మంది సభ్యుల ఎన్డీయే కూటమి మెజార్టీ తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నందున బీజేపీ నేతలు ఇతర పార్టీలు లేదా ఇతర సభ్యులపై ఆధారపడాల్సి వస్తుంది.
రాజ్యసభలో పరిస్థితేంటి?
వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంలో రాజ్యసభ కూడా ఒక కీలక అంశంగా ఉంటుంది. 236 మంది సభ్యులున్న ఎగువ సభలో ఈ బిల్లు ఆమోదానికి కేంద్రం 119 మంది సభ్యుల మద్దతు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీయేకు 123 మంది సభ్యులున్నారు. అంటే.. అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ మందితో ఎన్డీయే సానుకూల స్థితిలోనే ఉన్నది. కానీ.. మిత్రపక్షాల నుంచి ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా అధికార కూటమికి సవాలే.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం
వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు విషయంలో ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ వైఖరిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ‘సమాజ్‌వాది పార్టీ, టీఎంసీ, ఆప్.. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. జేడీయూ, టీడీపీ వంటి పార్టీలు ఏం చేస్తాయన్నదే ప్రశ్న. సెక్యులర్ పార్టీలుగా చెప్పుకొనే ఈ పార్టీలు ఈ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటాయి?’ అని ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
విశ్వాసంతో బీజేపీ
ప్రతిపక్షం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా.. పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించుకునే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. బిల్లు ఆమోదానికి సమర్పించినప్పుడు అన్ని పార్టీలు దానిపై లోతుగా చర్చలు జరపాలని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.