Parliamentophobia | మోదీకి పార్లమెంటోఫోబియా!

Parliamentophobia | సభకు రారు.. సమాధానాలు చెప్పరు కీలక బిల్లులపై చర్చలో ప్రధాని మోదీ ఎక్కడ? ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు నోట్ల రద్దుతో అద్భుతాలు జరుగుతాయన్నారు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపన్నారు ప్రధాని ట్రాక్‌ రికార్డు వంద శాతం వైఫల్యాలే.. అందుకే పార్లమెంటుకు రావడానికి భయం మోదీ వాగ్ధాటి ఉన్న నాయకుడే.. కానీ.. చేసేవన్నీ టెలిప్రాంప్టర్‌ ఉపన్యాసాలే పార్లమెంటును పట్టించుకునేది ఎవరు? పేరిట టీఎంసీ నేత డెరెక్‌ ఓ బ్రైన్‌ పుస్తకం ప్రధాని […]

  • Publish Date - July 29, 2023 / 01:34 AM IST

Parliamentophobia |

  • సభకు రారు.. సమాధానాలు చెప్పరు
  • కీలక బిల్లులపై చర్చలో ప్రధాని మోదీ ఎక్కడ?
  • ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు
  • నోట్ల రద్దుతో అద్భుతాలు జరుగుతాయన్నారు
  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపన్నారు
  • ప్రధాని ట్రాక్‌ రికార్డు వంద శాతం వైఫల్యాలే..
  • అందుకే పార్లమెంటుకు రావడానికి భయం
  • మోదీ వాగ్ధాటి ఉన్న నాయకుడే.. కానీ..
  • చేసేవన్నీ టెలిప్రాంప్టర్‌ ఉపన్యాసాలే
  • పార్లమెంటును పట్టించుకునేది ఎవరు?
  • పేరిట టీఎంసీ నేత డెరెక్‌ ఓ బ్రైన్‌ పుస్తకం
  • ప్రధాని మోదీ ట్రాక్‌ రికార్డు అక్షరీకరణ

యూపీఏ-2 ప్రభుత్వం అధికారం కోల్పోవటానికి ఏడాది ముందు.. అప్పటి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం రాజ్యసభలో ఒక బిల్లు ఆమోదం పొందే ప్రయత్నాల్లో ఉన్నది. అప్పటి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌ శుక్లా.. సభకు అధికార పక్ష సభ్యులు అంతా హాజరై, ఓటింగ్‌లో పాల్గొనేలా చూశారు. అప్పటి నామినేటెడ్‌ సభ్యులైన సచిన్‌ టెండూల్కర్‌, సినీనటి రేఖ తదితర అరుదుగా సభలో కనిపించేవారు సైతం ఆ రోజు తమ సీట్లలో ఆశీనులయ్యారు. బిల్లు ఆమోదం పొంది.. సభ వాయిదా పడిన అనంతరం సభ నుంచి వెళుతున్నవారిలో రేఖ కూడా ఉన్నారు.

అప్పుడు శుక్లా ఆమెను కలిసి.. ‘ఈ రోజు సభకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు రేఖాజీ’ అన్నారు. అందుకు ఆమె చిరునవ్వుతో బదులిస్తూ.. ‘సంతోషం. ఇబ్బంది ఏమీ లేదు. ఈసారి మళ్లీ నేను రావాల్సి వస్తే.. పిలవండి. నేను మళ్లీ వస్తాను’ అని జవాబు ఇవ్వడంతో అక్కడే ఉన్న మేం అవాక్కయ్యాం. అంటే.. ఒక ఎంపీని పార్లమెంటుకు ఆహ్వానించాలన్న మాట! ప్రధాని నరేంద్రమోదీ వ్యవహారం కూడా రాజ్యసభ, లోక్‌సభల విషయంలో అలానే కనిపిస్తున్నది. పార్లమెంటు అంటే పట్టింపు ఎవరికి? హూ కేర్స్‌ ఎబౌట్‌ పార్లమెంట్‌: స్పీకింగ్‌ టు ప్రొటెక్ట్‌ నేషన్స్‌ గ్రేటెస్ట్‌ ఇన్‌స్టిట్యూషన్‌ పుస్తకంలో డెరెక్‌ ఓ బ్రైన్‌

న్యూఢిల్లీ : భారతదేశ చరిత్రలోనే పార్లమెంటుకు వచ్చేందుకు, చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపని ప్రధాని ఎవరైనా ఉన్నారా? అంటే అది నరేంద్ర మోదీయేనని అంటున్నారు టీఎంసీ నేత డెరెక్‌ ఓ బ్రైన్‌. పార్లమెంటుకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు సభ్యుల అనుభవాల్లో, వారు రాసిన పుస్తకాల్లో వెలుగు చూస్తూ ఉంటాయి. తాజాగా బ్రైన్‌ రాసిన పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి. ఆ పుస్తకంలోని ఒక భాగంలో ప్రధానంగా నరేంద్రమోదీ ట్రాక్‌ రికార్డును, వ్యవహార శైలిని ఆయన చీల్చి చెండాడారు.

మోదీకి పార్లమెంటోఫోబియా

‘మోదీ వాగ్ధాటి కలిగని నాయకుడని ఆయన గట్టిగా విమర్శించేవారు సైతం అంగీరిస్తారు. అయితే.. అన్ని సందర్భాల్లోనూ టెలిప్రాంప్టర్‌నే వినియోగించడంలో దిట్ట. అయినా పార్లమెంటులో మితభాషిత్వం దేనికి? రోజువారీ చర్చల్లో పాల్గొనకుండా ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఆయనకు పార్లమెంటోఫోబియాతో (పార్లమెంటు అంటే భయం) ఎందుకు బాధపడాలి?’ అని ఆయన ప్రశ్నించారు.

మోదీ తన ఉపన్యాసాల్లో భారీగా వాగ్దానాలు చేస్తారని, ఆచరణలో మాత్రం అవి అమలు కావని పేర్కొన్నారు. ఇందువల్లే ఆయన పార్లమెంటులో మాట్లాడేందుకు జంకుతున్నారని విశ్లేషించారు. ‘మోదీ ప్రధానిగా ఉన్న కాలంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నది. కరోనా విశ్వమారి సమయంలో కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు.

ఇది పక్కనపెడితే.. ఆయన దేశ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. టాయ్‌లెట్‌, నల్లా, విద్యుత్తుతో కూడిన పక్కా ఇల్లు ప్రతి ఒక్క భారతీయుడికీ కట్టిస్తానని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రకటించారు. ఇదంతా 2022 నాటికి పూర్తి చేస్తానని గడువు కూడా విధించుకున్నారు. కానీ.. ఏమీ జరుగలేదు. బుల్లెట్‌ రైళ్లు తెస్తామన్నారు కానీ.. అవి ఐదేళ్లు లేటుగా నడుస్తున్నాయి.

2024 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చుతానని గొప్పలు చెప్పినా.. అది ఆచరణలో అయ్యేలా కనిపించడం లేదు’ అని ఆయన తెలిపారు. నోట్ల రద్దు అనే అత్యంత కీలక నిర్ణయాన్ని కూడా మోదీ పార్లమెంటులో చర్చించకుండానే తీసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుతో నల్లధనం రద్దవుతుందని, నకిలీ కరెన్సీ అంతరించిపోతుందని, ఉగ్రవాదం ఆగిపోతుందని, అవినీతి సమసిపోతుందని ఘంటాపథంగా చెప్పినా.. ఇవేవీ జరుగలేదని గుర్తు చేశారు.

ఇలా వందశాతం వైఫల్యాల రికార్డు ఉన్న మోదీ.. పార్లమెంటును తప్పించుకోవడానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యం ఏమున్నదని పేర్కొన్నారు.

కీలకమైన బిల్లుల సమయంలోనూ గైర్హాజర్‌

కీలకమైన సీఏఏ బిల్లుపై చర్చ సందర్భంలో కానీ, జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 356 రద్దు సమయంలో కానీ, ముస్లిం మహిళ (వివాహంపై హక్కుల) చట్టం ఆమోదం సమయంలోగానీ, ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు బిల్లు విషయంలోకానీ మోదీ పార్లమెంటులో లేరన్న డెరెక్‌ ఓ బ్రైన్‌.. ఆయన ఎందుకు అదృశ్యమయ్యారని ప్రశ్నించారు. ఇవే కాకుండా అనేక కీలక బిల్లులు సభకు వచ్చినప్పుడు కూడా మోదీ సభలో లేరని వివరాలు వెల్లడించారు.

‘ఆలకించడం అనేది నైపుణ్యం కాదు.. అదొక క్రమశిక్షణ. ఎవరైనా దానిని పాటించవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఆ సమయంలో మీరు మీ నోరు మూసుకోడమే’ అని.. మేనేజ్‌మెంట్‌ గురు పీటర్‌ డ్రుక్కర్‌ చెప్పిన మాటలను టీఎంసీ నేత తన పుస్తకంలో కోట్‌ చేశారు. ‘ఆలకించడం అనే నైపుణ్యం మోదీకి లేదు.

గొప్ప వాగ్ధాటి ఉన్న వారు మంచిగా ఆలకించగలిగిన వారు కూడా అయి ఉంటే.. అలాంటివారు గొప్ప పార్లమెంటేరియన్లుగా తమను తాము ఆవిష్కరించుకోగలరని ఎవరన్నా మోదీకి సలహా ఇస్తే బాగుండు’ అని డెరెక్‌ ఓ బ్రైన్‌ తన పుస్తకంలో ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్లమెంటుకన్నా.. బెంగాల్‌లో మాట్లాడిందే ఎక్కువ

2021 పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో మోదీ 11 గంటల 33 నిమిషాలు వెచ్చించారని బ్రైన్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. కానీ.. అదే ఏడాది బడ్జెట్‌ సమావేశాలు, వర్షాకాల, సీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ఆయన మొత్తంగా కనీసం నాలుగు గంటలు కూడా గడపలేదని తెలిపారు.

అంటే.. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు పూజారి లాంటి ప్రధాని.. పార్లమెంటులో కంటే.. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాట్లాడింది మూడింతలు ఎక్కువని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందు అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని మోదీ పేర్కొంటారని, కానీ వాస్తవంలో దానికి విరుద్ధంగా జరుగుతుంటుందని బ్రైన్‌ తన పుస్తకంలో రాశారు.

13 ప్రశ్నలకు సమాధానాలు

మోదీ ప్రధాని అయిన తర్వాత పీఎంవో కేవలం 13 ప్రశ్నలకే సమాధానాలు ఇచ్చిందని, కానీ, మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న పదేళ్లలో 85 ప్రశ్నలకు జవాబులు చెప్పారని ఆయన వెల్లడించారు. ‘పార్లమెంటు వేదికగా ప్రధాని చివరిసారిగా చెప్పిన సమాధానం ఏమిటి? ప్యాకేజీ రేడియో ప్రోగ్రామ్‌లతో గాలిలో మాట్లాడటం పార్లమెంటులో మాట్లాడటానికి ప్రత్యామ్నాయం కాదు’ అని ఆయన పేర్కొన్నారు.

గగోయ్‌, మోదీ ఒక్క తాను ముక్కలు

‘ప్రధాని తరహాలోనే మరొకరు ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభలో వెనుక బెంచీల్లో కూర్చొనే సుప్రీం కోర్టు మాజీ సీజే రంజన్‌ గగోయ్‌. ఆయన కూడా పార్లమెంటులో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తన రిటైర్మెంట్‌ తర్వాతి నాలుగు నెలల్లోనే రాజ్యసభకు నామినేట్‌ చేస్తామని ప్రతిపాదన వస్తే.. అంగీకరించి.. కొత్త సంప్రదాయానికి తెర తీశారు.

ఆయన తరచూ ‘నాకు వెళ్లాలని అనిపించినప్పుడు నేను రాజ్యసభకు వెళతాను. నేను మాట్లాడ వలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయని భావిస్తే.. నేను మాట్లాడుతాను. నా ఇష్ట ప్రకారం వెళతాను.. నా ఇష్టప్రకారం బయటకు వచ్చేస్తాను’ అని చెబుతుంటారు’ అని బ్రైన్‌ తన పుస్తకంలో రాశారు. మోదీ, గగోయ్‌ ఒకే తాను ముక్కలని ఆయన అభివర్ణించారు.

‘ఒక ప్రభుత్వాధి నేత, ఒక న్యాయవ్యవస్థ మాజీ అధినేత పార్లమెంటు విషయంలో ఇలాంటి ధోరణితో ఉంటే.. 2014 నుంచి ప్రజాస్వామిక సూచీలో భారతదేశం గణనీయంగా దిగజారిపోతుండటంలో ఆశ్చమేముంది?’ అని ఆయన పేర్కొన్నారు.

గుజరాత్‌ సీఎంగానూ అంతే

పార్లమెంటు పట్ల అగౌరవ భావంతో మోదీ ఉండటంలో ఆశ్చరం ఏమీ లేదన్న టీఎంసీ నేత.. ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు. ‘గుజరాత్‌ అసెంబ్లీ.. మిగతా సీఎంలతో పోల్చితే.. అతి తక్కువ సార్లు సమావేశమైంది ఆయన హయాంలోనే. 11 ఏళ్ల పదవీకాలంలో గుజరాత్‌ అసెంబ్లీలో 327 సిటింగ్స్‌ జరిగాయి. అంటే ఏడాదికి 30 రోజులు కూడా సభ నడవలేదు. ఆఖరుకు ఆయకు ముందు సీఎంగా పనిచేసిన కేశూభాయ్‌ పటేల్‌ హయాంలోనే ఏడాదికి 50 సిటింగ్‌లు జరిగాయి’ అని ఆయన వివరించారు.

‘ఆలకించడం అనే నైపుణ్యం మోదీకి లేదు. గొప్ప వాగ్ధాటి ఉన్న వారు మంచిగా ఆలకించగలిగిన వారు కూడా అయి ఉంటే.. అలాంటివారు గొప్ప పార్లమెంటేరియన్లుగా తమను తాము ఆవిష్కరించుకోగలరని ఎవరన్నా మోదీకి సలహా ఇస్తే బాగుండు’.