Pawan Kalyan
విధాత: జనసేనాని ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసేది కన్ఫామ్ అయ్యిందా ? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి.. ఓడిన చోటే మళ్ళీ గెలవాలి అనే పట్టుదలతో ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా గెలవాలని తపిస్తున్నారా ? అందుకే మెల్లగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ? అయన ఒడుపు చూస్తుంటే అలాగే ఉంది.
భీమవరంలో రోడ్ షో చేసిన పవన్ అక్కడి ప్రభాస్ అభిమానులకు సారీ చెప్పారు. తన అభిమానులకు, ప్రభాస్ అభిమానులకు మధ్య అప్పట్లో చిన్న గొడవ జరిగిందని, అందుకుని తాను సారీ చెబుతానని అన్నారు. వాస్తవానికి జూన్ లో పవన్ పుట్టిన రోజు నాడు భీమవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రభాస్ ఫాన్స్ చించేశారు అంటూ పవన్ ఫాన్స్ గొడవ చేయడం, రాళ్లు విసరడం జరిగింది.
ఈ నేపథ్యంలో కొందరిని పోలీసులు విచారణ నిమిత్తం తీసుకువెళ్లగా అక్కడ మరికొందరు పవన్ ఫాన్స్ వెళ్లి స్టేషన్ వద్ద ధర్నా చేశారు. దీంతో భీమవరంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి పరిస్థితి అదుపు చేశారు. అయితే ఆ ఘటనకు నేడు పవన్ సారీ చెప్పారు.
వాస్తవానికి పవన్ 2019లో పవన్ కళ్యాణ్ ఈ భీమవరం నుంచి పోటీ చేసి గ్రంధి శ్రీనివాస్ (వైఎస్సార్సీపీ) చేతిలో ఓడిపోయారు. పవన్ అటు గాజువాకలో సైతం పోటీ చేసి ఓడిపోయన సంగతి తెలిసిందే. అయితే గోదావరి జిల్లాలో పవన్ ఓడిపోవడం అటు రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలవడం పవన్ కు అవమానకరంగా మారింది.
దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో పవన్ ఈసారి భీమవరంలో పోటీకి సిద్ధం అంటున్నారు. ఇక భీమవరంలో క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువ.. ఈ నేపథ్యంలో క్షత్రియులు, ప్రభాస్ అభిమానులను ప్రసన్నం చేసుకునేందుకు పవన్ అలా సారీ చెప్పారని అంటున్నారు.
ఇదిలా ఉండగా ప్రభాస్ పెద్దమ్మ ( దివంగత కృష్ణంరాజు భార్య) శ్యామలాదేవిని వైఎస్సార్సీపీ నుంచి నరసాపురంలో ఎంపీగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి అంటున్నారు. నరసాపురంలో మొన్న గెలిచిన రఘురామకృష్ణం రాజు వైసిపికి దూరంగా టిడిపికి దగ్గరగా ఉంటున్న నేపథ్యంలో అక్కడ మళ్ళీ క్షత్రియులకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశ్యంతో కృష్ణంరాజు కుటుంబానికి టికెట్ ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట.