Fly |
భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానో, లేదంటే ఏదైనా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన ఘటనలను చాలానే చూశాం. కానీ వీరు మాత్రం ఈగల బెడదను తట్టుకోలేక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్దోయ్ జిల్లాలోని కుయ్య గ్రామంలో గత కొంతకాలం నుంచి ఈగల సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఇంట్లో ఈగల బెడద ఉండటంతో.. స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.
ఈగల నుంచి తప్పించుకునేందుకు దోమ తెరలు వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతే కాదు.. ఈగల కారణంగా కొన్ని వివాహాలు కూడా వాయిదా పడ్డాయి. మహిళలు ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. బంధువులు కూడా రావడం లేదు.
పరిస్థితి దారుణంగా మారడంతో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓ ఏడుగురు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని, వారితో గంటల తరబడి చర్చించి కిందకు దించారు. దీంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈగల బెడదకు స్థానికంగా ఉన్న పౌల్ట్రి ఫామే కారణమని, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.