RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌పై బిహార్‌ కోర్టులో కేసు..

<p>RSS Chief Mohan Bhagwat | పండిట్లు, బ్రాహ్మణులను కించపరిచారంటూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు వ్యతిరేకంగా బిహార్‌ ముజఫర్‌పూర్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఓజా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించారని ఆరోపిస్తూ పలు సెక్షన్ల కింద భగవత్‌పై ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టు ఈ నెల 20న విచారణ చేపట్టనున్నది. ఇదిలా ఉండగా.. […]</p>

RSS Chief Mohan Bhagwat | పండిట్లు, బ్రాహ్మణులను కించపరిచారంటూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు వ్యతిరేకంగా బిహార్‌ ముజఫర్‌పూర్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఓజా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించారని ఆరోపిస్తూ పలు సెక్షన్ల కింద భగవత్‌పై ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టు ఈ నెల 20న విచారణ చేపట్టనున్నది.

ఇదిలా ఉండగా.. కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లోనూ మంగళవారం సంఘ్‌ చీఫ్‌పై కేసు నమోదైంది. బ్రాహ్మణ సమాజం అవమానానికి గురవుతోందని అఖిల భారతీయ బ్రాహ్మణ ఏక్తా పరిషత్‌ వారణాసి యూనిట్‌ సభ్యులు ఆరోపించారు. మరో వైపు కేంద్రీయ బ్రాహ్మణ మహాసభ యువమంచ్‌ ఆఫీస్‌ బేరర్లు సమావేశమై భగవత్‌ ప్రకటనను ఖండించారు. సంఘ్‌ చీఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల మహారాష్ట్ర ముంబయిలో శిరోమణి రోహిదాస్‌ 647వ జయంతి కార్యక్రమానికి మోహన్‌ భగవత్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల సృష్టి మతగురువులు, పురోహితులదే తప్ప భగవంతుడు సృష్టించనవి కావన్నారు. దేశంలో అందరి మనస్సాక్షులు ఒకటేనని, కానీ అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. ప్రతి పని సమాజ హితం కోసమే అనుకున్నప్పుడు.. అది చిన్నదా లేక పెద్దదా అని ఎలా విభజిస్తామని ప్రశ్నించారు. మనమంతా సమానమేనని.. కులం, వర్గం లేవని.. మన గురువులే వాటిని సృష్టించారన్న ఆయన ఇది తప్పని వ్యాఖ్యానించారు.