Site icon vidhaatha

Kubera Movie| కుబేరా సినిమా కథ రచనలో పింగళి వెంకయ్య మునిమనవరాలు !

విధాత : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంతో వచ్చిన కుబేరా సినిమా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళ హీరో ధనుష్, టాలీవుడ్ సినీయర్ హీరో నాగార్జున, హీరోయిన్ రష్మిక మందానలు నటించిన ఈ సినిమా కొన్ని నెలలుగా హిట్ సినిమా రుచి చూడని తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి హిట్ అందించి థియేటర్లను కళకళలాడించింది. శేఖర్ కమ్ముల కథ..స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంలో రూపొందిన కుబేరా సినిమా కథ అందరిని ఆకట్టుకుంది. కుబేర మూవీ కథకు కో రైటర్ గా పనిచేసిన పింగళి చైతన్య అనే మహిళా రచయిత పేరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పింగళి చైతన్య ఎవరో కాదు..మన జాతీయ జెండాకు రూపకల్పన చేసిన స్వాంతంత్ర్య సమరమోధుడు పింగళి వెంకయ్య మునిమనవరాలు కావడం విశేషం. అంతేకాదు ఆయన మనుమడు..సంచలన జర్నలిస్టుగా పేరొందిన దివంగత పింగళి దశరథ రామ్ కూతురు పింగళి చైతన్య. దశరథ రామ్ ఎన్ కౌంటర్ అనే పత్రికను స్థాపించి తెలుగు జర్నలిజంలో విప్లవాత్మక కథనాలతో సంచలనం రేపారు. ఈ నేపథ్యంలోనే దుండగులు ఆయనను 29 ఏళ్ల వయసులో హత్య చేశారు. దశరథరామ్ కూతురైన చైతన్య విజయవాడలో పుట్టినప్పటికి కోదాడలో పెరిగారు. తన తండ్రి అడుగుజాడలో రచనా రంగంలో రాణిస్తున్నారు. కొన్నాళ్లు విజయ విహారం పత్రికలోనూ పనిచేశారు.

చైతన్యకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం
చైతన్య పింగళి వెంకయ్య మునిమనుమరాలిగా, దశరథ రామ్ వారసురాలిగా రచనలో ప్రత్యేక శైలిని కొనసాగిస్తున్నారు. కుబేర సినిమాకు కథానిర్మాణంలో కో రైటర్ గా పనిచేశారు. తెలుగు కథా రచనలో ప్రస్తుత తరంలో తనది ఓ ప్రత్యేక స్థానం. తెలుగు కథ, సినిమా రచయితగా ఎదిగిన పింగళి చైతన్య చిట్టగాంగ్ విప్లవ వనితలు, మనసులో వెన్నెల కథలతో జాతీయ సాహితీ రంగంలో గుర్తింపు పొందారు. చిట్టగాంగ్ విప్లవ వనితలు కథా సంపుటికి 2016లో ఆమెకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.

సినిమా రంగంలో చైతన్య రచనలు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా కథకు, తాజాగా కుబేరా సినిమా కథకు చైతన్య కో-రైటర్‌గా పనిచేసింది. అంతేకాకుండా ఫిదా సినిమాలో ‘ఊసుపోదు ఊరుకోదు’, ‘ఫిదా ఫిదా’, నేల టికెట్ సినిమాలో ‘బిజిలి’, ‘విన్నానులే’, లవ్ స్టోరీ (2020) సినిమాలో ‘ఏయ్ పిల్ల’, మసూద (2022) సినిమాలో ‘దాచి దాచి’ వంటి పాటలు రాసింది. షరతులు వర్తిస్తాయి (2024) సినిమాలో ‘ఆకాశం అందని’ అనే పాట రాసింది. కుబేర (2025) సినిమాకు ఆమె కథా నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. తెలుగు సాహితీ రంగంలో, సినీ రచయితలలో మహిళా రచయితలు అతి తక్కువగా ఉన్న నేటి పరిస్థితుల్లో పింగళి చైతన్య భవిష్యత్తులో అలరించే..ఆలోచన రగిలించే మరిన్ని రచనలు..కథలతో మరింత ఎత్తుకు ఎదగాలని సాహిత్య అభిమానులు ఆశిస్తున్నారు.

Exit mobile version