Site icon vidhaatha

త్వరలో విశ్వ ఆర్థిక శక్తిగా భారత్‌: ప్రధాని మోదీ

విధాత‌: ప్రపంచ వృద్ధికి భారత్‌ను ఇంజిన్‌గా మార్చడమే తమ లక్ష్యమని, త్వరలోనే భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సు 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అహ్మదాబాద్‌లో బుధవారం ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఇందులో మోదీ మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం తాము వైబ్రంట్‌ గుజరాత్‌ అనే చిన్న విత్తనాలు నాటామని, ఇప్పుడు అది మహా వృక్షంగా ఎదిగిందని చెప్పారు. ‘దేశానికి గ్రోత్‌ ఇంజిన్‌గా గుజరాత్‌ను తయారు చేసేందుకు మేం వైబ్రంట్‌ గుజరాత్‌ను చేపట్టాం. 2014 తర్వాత మా లక్ష్యం.. ఇండియాను ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా మార్చడం’ అని ఆయన పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి చెప్పారు.

ఇక త్వరలోనే భారతదేశం విశ్వ ఆర్థిక శక్తిగా ఎదిగే దశలో ఉన్నామని అన్నారు. ‘ఇప్పటి నుంచి కొన్నేళ్లలోనే.. మీ కళ్ల ముందే భారతదేశం ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారుతుందని నేను హామీ ఇస్తున్నాను’ అని ఆయన చెప్పారు.

Exit mobile version