విధాత: గుజరాత్‌లోని వడోదర, అహ్మదాబాద్, ద్వారక, సోమనాథ్ వంటి ప్రత్యేక ప్రదేశాల్లో ఉన్నటువంటి అక్షర్‌దామ్ ఆలయం, జ్యోతిర్లింగాలు, తదితర ప్రత్యేక ఆలయాలు, మహాత్మ గాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమం, సరయూ నది ఒడ్డున ఏర్పాటు చేసిన స్టాచూ ఆఫ్ యూనిటి వంటి ప్రముఖ ప్రాంతాలను చూపించేందుకు IRCTC రూ.25820కే ‘సుందర్ సౌరాష్ట్ర’ పేరుతో బెస్ట్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ యాత్ర పూర్తిగా 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగుతుంది. డిసెంబర్ 3న యాత్ర ప్రారంభం కానున్నది.
యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు: మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి రైలు నెంబర్: 20967 సికింద్రాబాద్-పోర్ బందర్ ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 03: గంటలకు బయలుదేరుతుంది. రాత్రి ప్రయాణం చేస్తారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు వడోదర చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఆరోజు మధ్యాహ్నం సొంత ఖర్చులతోనే స్టాచూ ఆఫ్ యూనిటీ సందర్శిస్తారు. ఆ రాత్రి వడోదరలోనే బస చేస్తారు.
మూడవ రోజు ఉదయం హోటల్ ఖాళీ చేసి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ చూస్తారు. అక్కడి నుంచి 110 కి.మీ దూరంలో ఉన్న అహ్మదాబాద్ వెళ్తారు. అక్కడ మహాత్మ గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమం, అక్షర్ ధామ్ టెంపుల్ దర్శించుకుని హోటల్ చేరుకుంటారు, రాత్రికి హోటల్‌లో బస చేస్తారు.
నాలుగవ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడి నుంచి 440 కి.మీ దూరంలో ఉన్న జామ్ నగర్ లఖోటా ప్యాలెస్, మ్యూజియం చూస్తారు. సాయంకాలానికి ద్వారక చేరుకుంటారు. అక్కడి హోటల్‌లో రాత్రికి బస చేస్తారు. ఐదవ రోజు ఉదయం ద్వారక టెంపుల్ దర్శించుకుంటారు. బెట్ ద్వారక, నాగేశ్వర్ ఆలయం దర్శించుకుని తిరిగి ద్వారకలోని హోటల్ చేరుకుంటారు.
ఆరవ రోజు హోటల్ వేకేట్ చేసి 240 కి.మీ దూరంలో ఉన్న సోమనాథ్ బయల్దేరతారు. అక్కడి నుంచి పోర్ బందర్ కిర్తి మందిర్, సుధమ ఆలయం చూస్తారు. ఆ తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అలాగే చుట్టుపక్కల ఉన్న మరిన్ని దేవాలయాలని చూస్తారు. రాత్రికి పోర్ బందర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. రాత్రి 12.50 గంటలకు పోర్ బందర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ ఎక్కేస్తారు. చివరిగా 8వ రోజు ఉదయం 08.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.
టికెట్ ధరలు: ఈ యాత్రలో కంఫర్ట్, స్టాండర్డ్ అనే రెండు రకాల ప్యాకేజీలు ఉంటాయి. కంఫర్ట్ అయితే రైల్లో ప్రాయణించేప్పుడు 3ఏసీ టికెట్లు, హోటల్‌లో ఏసీ గదులు ఉంటాయి. స్టాండర్డ్ అయితే స్లీపర్ టికెట్లు, హోటల్‌లో నాన్ ఏసీ గదులు కేటాయిస్తారు. ఈ యాత్రకు ఒక్కరు వెళ్లేందుకు అవకాశం లేదు. ఇద్దరు, ముగ్గురు అంతకు మించి కలిసి వెళ్లాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్తే కంఫర్ట్ అయితే ఒక్కో వ్యక్తి రూ.30560 చొప్పున చెల్లించాలి. అదే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు కలిసి వెళ్తే ఒక్కొక్కరు రూ.29880 కట్టాలి. అదే స్టాండర్డ్ అయితే ఇద్దరు కలిసి వెళ్లే వారు ఒక్కొక్కరు రూ.27650 చొప్పున, ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్కరు రూ.26960 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఉన్నట్లైతే కంఫర్ట్‌లో అయితే విత్ బెడ్ రూ. 21170, వితౌట్ బెడ్ అయితే రూ. 19610, స్టాండర్డ్ అయితే విత్ బెడ్ రూ.18250, వితౌట్ బెడ్ రూ.16690 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
గమనిక: మరింత సమాచారం కోసం IRCTCవెబ్ సైట్‌ను సంప్రదించగలరు.
