Satyasha Leuva | గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు! డబ్బు ఖర్చును తగ్గించి సులభంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఒక మార్గం! అయితే.. ఈ ఏకగ్రీవాల్లో చాలా వరకూ ఆధిపత్య రాజకీయాలతోనే అవుతూ ఉంటాయి. వీటిని ప్రోత్సహించేందుకు అన్నట్టు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవ ఎన్నికలు (Unanimous election) జరిగిన గ్రామాలకు ప్రోత్సాహక నిధులిస్తామని ప్రకటిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇది ఎన్నికల్లో ప్రజలు పాల్గొనే హక్కునే నిరాకరించేదే అనే విమర్శలు ఉన్నాయి. కానీ.. ఆధిపత్య రాజకీయాల ముందు ఈ హక్కు వెలవెలపోతూ ఉంటుంది. కానీ.. ఈ ఆధిపత్యాన్ని (defied pressure) జయించి.. గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా న్యాయవాది అయిన ఒక యువతి ఘన విజయం (victory) సాధించింది. ఆమె పేరు సత్యషా జగదీశ్‌చంద్ర లెయువా! పాతికేళ్ల యువతి. వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె విజయం గురించే ఈ కథనం!
గుజరాత్‌లో రెండు నెలల క్రితం జూన్‌లో రాష్ట్రంలోని 4,564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు (gujarat gram panchayat) నిర్వహించారు. రాష్ట్ర సమ్రాస్ గ్రామ్ యోజన కింద ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించుకున్న పంచాయతీలకు వాటి అర్హతను బట్టి మూడు లక్షల నుంచి పదమూడు లక్షల వరకూ ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో అక్కడ 761 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. సమ్రాస్ యోజనను ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చారు. చాలా రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నాయి.
భిన్నంగా నిలిచిన వడవాస
కానీ.. వడవాస గ్రామం అందుకు భిన్నంగా నిలిచింది. సబర్‌కంఠ జిల్లాలోని ఈ గ్రామం.. ప్రజాస్వామ్యానికే పెద్ద పీట వేసింది. ఇదే గ్రామంలో సత్యషా పుట్టి పెరిగారు. గ్రామం అభివృద్ధికి నోచుకోకపోవడంపై ఆమె పెద్ద పోరాటమే చేశారు. చదువుకొనే రోజుల్లో ఆమె ప్రతిరోజూ ఏడు కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్లేవారు. ఆ రోడ్లు కూడా గుంతలతో, మురికితో ఉండేవి. స్కూలు అయిపోయిన తర్వాత చీకటిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది. ఇవాళ్లికి కూడా ఆ స్కూలులో 8వ తరగతి వరకు మాత్రమే చదువుకొనే అవకాశం ఉన్నది. దీంతో పేద కుటుంబాల్లోని ఆడ పిల్లలు మధ్యలోనే చదువు మానేయాల్సిన పరిస్థితి. గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోడ్లన్నీ దుర్గంధాన్ని వెలువరిస్తున్నాయి.
అహ్మదాబాద్‌లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకొన్న సత్యషా.. ఒక స్పష్టమైన అవగాహనతో తన గ్రామానికి వచ్చారు. తాను పుట్టిపెరిగిన గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామ పాలన వ్యవస్థలో మార్పులు వస్తే కానీ.. తను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేనని అర్థం చేసుకున్నారు. కేరళలో విద్యార్థి రాజకీయాలతో స్ఫూర్తి పొందిన సత్యాష.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ.. గ్రామ పెద్దల ఆలోచన మరో విధంగా ఉన్నది.
ఏకగ్రీవాలు, ప్రజాస్వామ్యం మధ్య పోటీ
అప్పటికి నామినేషన్ల ఉపసంహరణకు మరో రెండు రోజులే గడువు ఉంది. గ్రామ పెద్దలు వరుస సమావేశాలు నిర్వహించారు. కొందరు పెద్దలు, స్థానికంగా ప్రభావం చూపగల కొన్ని శక్తులు సమ్రాస్ విధానాన్ని ఎంచుకోవాలని ప్రతిపాదించారు. అంటే.. అందరి ఆమోదంతో ఒకరే అభ్యర్థిగా నిలబడటం, ఏకగ్రీవం ఎన్నిక కావడం. అలా చేస్తే గ్రామ అభివృద్ధికి నిధులు వస్తాయని వాదించారు.
కానీ.. సత్యషా తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజ్యాంగం తనకు హక్కు కల్పించిందని, తనను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం ఆ హక్కును ఉల్లంఘించడమేనని గట్టిగా వాదించారు. ‘నామినేషన్లకు ముందు కూడా కొందరు సమావేశాలు ఏర్పాటు చేసి, ఎన్నికలు జరుగకుండా చూసేందుకు నాపై ఒత్తిడి చేశారు’ అని ఆమె డౌన్ టు ఎర్త్ ప్రతినిధికి చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఆమె తండ్రి సైతం ఎందుకమ్మా రాజకీయాలు.. అంటూ ఆమె సంకల్పాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. గ్రామ పెద్దలు నానామాటలూ అన్నారు. కానీ.. అవేవీ పట్టించుకోని సత్యషా.. నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నిర్ణయానికి ఆ గ్రామంలోని యువత జై కొట్టింది. ఆమె వెంట నడిచారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దృఢ సంకల్పంతో నిలబడ్డారు. చివరకు సత్యషా.. 5వేల ఓట్లు ఉన్న ఆగ్రమానికి 104 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత కూడా ఆమెను గ్రామ పెద్దలు వదల్లేదు. గ్రామానికి వచ్చే మూడు లక్షల రూపాయలు రాకుండా అడ్డుకున్నావంటూ తిట్లు కురిపించారు.
కానీ.. ఆమె తన లక్ష్యం పట్ల స్థిర నిశ్చయాలతో ఉన్నారు.
- గ్రామంలో విద్యను మెరుగుపర్చాలి.
- గ్రామీణ లైబ్రరీ ఏర్పాటు చేయాలి.
- పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలి.
- ఉపాధి పథకాల ఆధారంగా గ్రామంలోని యువతకు ఉపాధి కల్పించాలి.
- కేరళ విద్యారంగ ప్రమాణాలకు దీటుగా వడవాస గ్రామాన్ని నిలపాలి