Site icon vidhaatha

Teesta Setalvad | తీస్తాసెతల్వాద్‌కు స్వల్ప ఊరట

Teesta Setalvad

న్యూఢిల్లీ: 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ జరిగే 19వ తేదీ వరకూ ఆమెను అరెస్టును నిలిపివేస్తూ బుధవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే లొంగిపోవాలని గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై 19 వరకు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ ఏఎస్‌ బొపనన, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం స్టే ఇచ్చింది.

గుజరాత్‌ మత ఘర్షణలకు సంబంధించి ఉన్నతస్థాయి ప్రభుత్వ నేతలను ఇరికించేలా డాక్యుమెంట్లను తారుమారు చేశారన్న ఆరోపణలతో గుజరాత్‌ పోలీసులు సెతల్వాద్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో సెతల్వాద్‌తోపాటు.. మాజీ సీనియర్‌ పోలీస్‌ అధికారి ఆర్‌బీ శ్రీకుమార్‌ను ఫోర్జరీ, నేరపూరిత కుట్ర ఆరోపణలపై గతంలో అరెస్టు చేశారు.

ఈ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో 2022 సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి సెతల్వాద్‌ విడుదలయ్యారు. బాధితుల తప్పుడు వాంగ్మూలాలను సెతల్వాద్‌ తయారు చేసి, మత ఘర్షణలపై విచారించిన నానావతి కమిషన్‌కు అందజేశారని ఆరోపిస్తూ గుజరాత్‌ యాంటి టెర్రరిస్ట్‌ స్వ్కాడ్‌ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Exit mobile version