విధాత: యాంకర్, జర్నలిస్టు స్వేచ్చ మృతి కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న పూర్ణ చందర్ పై చిక్కడపల్లి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించడంకు సంబంధించి 69 బీఎన్ఎస్, 108 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వేచ్ఛ కూతురు స్టేట్‌మెంట్ ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశారు. గతంలో తనతో కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా సమాచారం. స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్ రావు కారణమని ఆరోపిస్తూ ఆమె తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు.
గత కొన్నాళ్ల నుంచి స్వేచ్ఛతో పూర్ణ చందర్ సహజీవనం చేస్తున్నాడని… వివాహం చేసుకోకుండా స్వేచ్ఛను వేధింపులకు గురిచేశాడని పూర్ణ చందర్ పై స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. పూర్ణచందర్ వేధింపులు భరించలేకనే స్వేచ్ఛ చనిపోయిందని ఆమె తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్ణనచందర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని..అతనో అమ్మాయిల పిచ్చోడని..నా మనవరాలిని సైతం వేధించాడని ఆరోపించారు. అంతకుముందు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న పూర్ణచందర్ శనివారం రాత్రి తన అడ్వకేట్ తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. పూర్ణచందర్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.