Supreme Court : విధాత, న్యూఢిల్లీః ఓ పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్ష విధించలేదు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోఈ నిర్ణయం తీసుకున్నట్టు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి మీద పోక్సో కేసు నమోదు కావడంతో ట్రయల్ కోర్టు ఈ ఘటనపై విచారించి అతడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం సదరు వ్యక్తి కోల్ కతా హైకోర్టును ఆశ్రయించడంతో అతడికి ఊరట దక్కింది. బాధితురాలు ఇష్టపూర్వకంగానే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం జరిగిందని.. అందుకే ఈ కేసులో అతడిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో కోల్ కతా హైకోర్టు తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నది.
దీంతో సుప్రీంకోర్టు శిక్షను పునరుద్ధరించింది. అయితే ఈ కేసుపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీ వేయాలని సూచించింది. ఈ కమిటీ తుది నివేదిక ఆధారంగా శిక్షపై అంతిమ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు బాధితురాలు.. అతడిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్ష వేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ధర్మాసనం బాధితురాలితో మాట్లాడింది. దోషితో బాధితురాలికి ప్రస్తుతం ఓ బంధం ఏర్పడింది కాబట్టి.. ఈ కేసులో అతడికి ఏ శిక్ష విధించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.