ఈ ప్రభుత్వం రెండు నెలలే ఉంటుంది.. అధికార పార్టీపై ‘పొంగులేటి’ ప్రత్యక్ష పోరు

విధాత: ఖమ్మం మాజీ పార్లమెంట్‌ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారపార్టీపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవ సీఎం చెప్పిన మాటలతో, పార్టీ నియమాలకు కట్టుబడి ఏ పార్టీకి వెళ్లకుండా, ఏ పార్టీ పంచన చేరకుండా నామినేషన్‌ రోజు వేలాది మంది వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని, ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఎంపీగా గెలిపిస్తామని చెప్పినా తాను నిరాకరించినట్టు చెప్పారు. […]

  • Publish Date - January 23, 2023 / 04:55 PM IST

విధాత: ఖమ్మం మాజీ పార్లమెంట్‌ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారపార్టీపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

గౌరవ సీఎం చెప్పిన మాటలతో, పార్టీ నియమాలకు కట్టుబడి ఏ పార్టీకి వెళ్లకుండా, ఏ పార్టీ పంచన చేరకుండా నామినేషన్‌ రోజు వేలాది మంది వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని, ఒక్క రూపాయి ఖర్చులేకుండా ఎంపీగా గెలిపిస్తామని చెప్పినా తాను నిరాకరించినట్టు చెప్పారు.

ఆ రోజు చేసిన వాగ్దానాలు, తనకే కాదు, తనను నమ్ముకున్న వాళ్లు ఏమీ చేయలేదు. పదవులు ఇవ్వకున్నా పరవాలేదు, ప్రతి మనిషిక ఆత్మగౌరవం ఉంటుందన్నారు. ఇక్కడ ప్రభుత్వం రెండు మూడు నెలలు ఉంటుంది. ఈ రెండు మూడు నెలల్లో మనల్ని ఇంకా ఇబ్బంది పెడుతారని, ఇంకా చాలా మంది మా శ్రేయోభిలాషులు ఇళ్ల దగ్గరే ఉండిపోయారు.

కానీ పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రేమ ముందు, ప్రస్తుత జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య ప్రేమ ముందు మీ దౌర్జన్యాలు, మీ ఆటలు చెల్లవని (అధికారపార్టీ నేతలను ఉద్దేశించి) అన్నారు. గతంలో మమ్మల్ని నమ్ముకుని ఉన్నవాళ్లను ఇబ్బందులు పెట్టినా ఉపేక్షించాం.

కానీ రాబోయే రోజుల్లో తనను గాని, కనకయ్యనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు ఎక్కడైనా ఏ వ్యక్తినైనా పోలీసులైనా, రెవెన్యూ అధికారులైనా, చివరికి అధికారమదంతో, అహంకారంతో ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటున్న వాళ్లు అన్యాయంగా, అక్రమంగా ఇబ్బందులు పెడితే ఎలా మూల్యం చెల్లించాలో మాకు తెలుసని హెచ్చరించారు.

ప్రత్యక్షంగా మీరు ఇబ్బంది పెట్టిన కొద్ది గంటల్లోనే ఈ ఇల్లందులోనే కాదు, ఏ నియోజకవర్గానికైనా పొంగు లేటి ప్రత్యక్షమౌతాడని , ఏ స్థాయి అధికారి అయినా, ఏ స్థాయి ప్రజాప్రతినిధి అయినా నమ్ముకున్న వాళ్ల కోసం నిరాహారదీక్ష చేయడానికి కూడా వెనుకాడని తెలిపారు.

ఆయన వ్యాఖ్యలను బట్టి మళ్లీ ఖమ్మం పార్లమెంటు బరిలో ఉన్నట్టు స్పష్టమౌతున్నది. ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ బలప్రదర్శనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఆయన అధికారపార్టీపై ఇక ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టే కనిపిస్తున్నది. బీఆర్ఎస్‌ అసంతృప్త నేత అడుగులు రానున్న రోజుల్లో ఏ పార్టీ వైపు ఉంటాయన్నది ఆసక్తి నెలకొన్నది.

Latest News