Gyanvapi | జ్ఞానవాపి మసీదులో పూజ

ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో గురువారం పూజ‌లు నిర్వ‌హించారు. ఒక పూజారి తెల్లవారుజామున 3 గంటలకు పూజా కార్యక్రమాలు జ‌రిపారు

  • Publish Date - February 1, 2024 / 05:35 AM IST

  • తెల్ల‌వారుజామున 3 గంట‌ల
  • ప్రాంతంలో హార‌తి ఇచ్చిన పూజారి
  • 31 ఏండ్ల త‌ర్వాత నిర్వ‌హ‌ణ‌


Gyanvapi | విధాత‌: ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో గురువారం పూజ‌లు నిర్వ‌హించారు. ఒక పూజారి తెల్లవారుజామున 3 గంటలకు పూజా కార్యక్రమాలు జ‌రిపారు. తరువాత హారతి ఇచ్చారు. పూజా కార్యక్రమాల ప్రారంభానికి ముందు, వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ రాజలింగం, పోలీసు కమిషనర్ అశోక్ ముఠా జైన్ అర్ధరాత్రి సమావేశమయ్యారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ఆవరణలోని హాలులో దాదాపు రెండు గంటలపాటు సమావేశం జరిగింది.


చర్చల అనంతరం జిల్లా యంత్రాంగం కోర్టు తీర్పు అమ‌లుకు చర్యలు చేపట్టింది. దక్షిణ సెల్లార్‌కు సాఫీగా ప్రవేశం కల్పించడానికి బారికేడ్ల‌ను తొల‌గించారు. దాంతో దక్షిణ సెల్లార్‌లో పూజా ఆచారాలు నిర్వ‌హించ‌డానికి మార్గ సుగ‌మం అయింది. బారికేడింగ్ తొలగించి కోర్టు ఆదేశాల మేరకు నడుచుకున్నామని రాజలింగం తెలిపారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో 31 ఏండ్ల త‌ర్వాత గురువారం తెల్ల‌వారుజామున మ‌ళ్లీ పూజ‌లు మొద‌ల‌య్యాయి. ఓ భ‌క్తుడు తాను నందిని చూసిన‌ట్టు సంబుర‌ప‌డ్డారు. ఎక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు భారీబందోబ‌స్తు ఏర్పాటుచేశారు.


జ్ఞాన‌వాపి మసీదు బేస్‌మెంట్‌లోని వ్యాస్‌ టిఖానా వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకొనేందుకు వారణాసి జిల్లా కోర్టు బుధ‌వారం అనుమతి ఇచ్చింది. వారంలోగా పూజలు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశం మేర‌కు మసీదు కాంప్లెక్స్‌లో గురువారం పూజలు మొద‌లు పెట్టిన‌ట్టు విశ్వనాథ్‌ ఆలయ చైర్‌పర్సన్‌ నాగేంద్ర పాండే చెప్పారు. ఇకపై రోజూ పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు. పూజలు నిర్వహించే ప్రాంతాన్ని పరిరక్షించేందుకు అక్కడ ఒక తలుపు ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. సంపూర్ణమైన జ్ఞానవాపి ఆలయంలో పూజలు నిర్వహించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నామని అన్నారు.

Latest News