విధాత: తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. ఈరోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.
దరఖాస్తుల కోసం కొత్త తేదీలను వెల్లడించింది. ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్-4 లో మొత్తం ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,169 పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేయనున్నది. ఈ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని సర్వీస్ కమిషన్ అంచనా వేస్తున్నది.
గ్రూప్ 2, 3 ప్రకటనల విడుదలకు కమిషన్ రెడీ
గ్రూప్-2, 3 పోస్టులకు ఉద్యోగల ప్రకటనలు వెలువరించడానికి సర్వీస్ కమిషన్ కసరత్తు పూర్తిచేసింది. గ్రూప్ 2,3 కేటగిరి పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ప్రభుత్వ విభాగాల పోస్టులను చేర్చింది. గ్రూప్-2 కింద మొదట 663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది.
అదనంగా చేరిన పోస్టులతో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 783కు చేరింది. గ్రూప్-3 కింద అనుమతిచ్చిన 1,373 పోస్టులకు అదనంగా మరో వందకు పైగా చేరనున్నాయి. ఈ రెండు ప్రకటనలు విడుదల చేయడానికి టీఎస్‌పీఎస్‌సీ బోర్డు ఇప్పటికే అమోదం తెలిపిన సంగతి తెలిసిందే.