Priyanka Gandhi | నిశ్శబ్దం, త్యాగం మా విశ్వాసానికి ప్రతీక: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరాఖండ్‌ రామ్ నగర్‌లో శనివారం ఎన్నిక‌ల‌ ప్రచారంలో పాల్గొన్నారు.

  • Publish Date - April 13, 2024 / 05:50 PM IST

దేశం కోసం ఎంత‌చేసినా మా కుటుంబాన్ని అవ‌మానిస్తారా?
దేశం ప‌ట్ల నిజ‌మైన విశ్వాసం, భ‌క్తి కాంగ్రెస్‌కే ఉందంటూ ఎమోష‌న‌ల్‌

డెహ్రాడూన్: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరాఖండ్‌ రామ్ నగర్‌లో శనివారం ఎన్నిక‌ల‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రియాంక మాట్లాడుతూ..దేశం ప‌ట్ల‌ త్యాగం గురించి ఎమోషనల్ అయ్యారు. బీజేపీలో ఏ నాయ‌కుడి పేరు ప్రస్తావించకుండా ప్రియాంక ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశం కోసం ఎంత చేసినా సరే తమ కుటుంబాన్ని అవమానిస్తారని మండిపడ్డారు.

అయినప్పటికీ తాము నిశ్శబ్దంగా ఉంటామని.. ఆ ఇబ్బందులు ఏంటో తమకు తెలుసు అని వివరించారు. ‘నాకు 19 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మా నాన్న రాజీవ్ మృతదేహం చూశాను. తండ్రి పార్థీవదేహం ముందు నా తల్లి కూర్చొని ఉంది. అప్పుడు తనకు త్యాగం అంటే ఏంటో, ఆత్మ బలిదానం అంటే ఏంటో అర్థమయ్యింది. మాకు దేశం పట్ల నిజమైన విశ్వాసం, భక్తి ఉంది. అందుకే మౌనంగా ఉన్నాం అని’ ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌పై ఇంకెంత‌కాలం ఏడుస్తారు?

బీజేపీపై ప్రియాంక ఘాటు విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎన్ని రోజులు నిందిస్తారు. గత పదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలో ఉంది. ఇప్పుడు 400 సీట్లు సాధిస్తామని గొప్పలు చెబుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారు. గత 75 ఏళ్లలో ఏమీ జరగలేదని బీజేపీ విమర్శలు చేస్తోంది. నిజంగా అభివృద్ధి జరగకుంటే ఉత్తరాఖండ్‌లో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ రాలేదా..? చంద్రుడిపై చంద్రయాన్ అడుగిడలేదా..? పండిగ్ నెహ్రూ ఆ రోజున ముందుచూపుతో పనులు చేస్తేనే కదా.. ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి అని’ ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు.

ఈడీకాదు మోడీ..

ఈడీపై ప్రియాంక తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ‘ప్రధాని మోదీ దృష్టిలో అందరూ అవినీతి పరులే, బీజేపీలో చేరిన‌వారు త‌ప్ప‌. రాజ‌కీయ నేత‌ల్లో మోదీ ఒక్కరే సచ్చీలురు అనే భావనలో ఉంటారు. తమ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ఉసిగొలుపుతారు. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ప్రభుత్వాలను పడగొడతారు. ఈ పనుల్లో త‌ల‌మున‌క‌లైపోయిన బీజేపీ ప్ర‌భుత్వం దేశంలో నిరుద్యోగ నిర్మూల‌న‌, ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను అదుపుచేయ‌డం గురించి బీజేపీ మరచిపోయింది’ అంటూ ప్రియాంక విమర్శించారు.

Latest News