Priyanka Gandhi
- ఆ సభలోనే మహిళా డిక్లకరేషన్..
- జూపల్లి, కూచుకుల్ల ప్రభృతుల చేరికలు
- వెల్లడించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి
విధాత: కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ ఈనెల 30న మహాబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ బహిరంగ సభకు హాజరవుతారని ఈ సభలోనే పార్టీ మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారని, అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, MLC కూచుకుళ్లలు పార్టీలో చేరుతారని PCC ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు.
గాంధీభవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతు కొల్లాపూర్ సభ కోసం రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభకు మహిళలను ఎక్కువగా తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళా నాయకురాలు సునీతరావు ఆధ్వర్యంలో పార్టీ మహిళా విభాగాలు మహిళల తరలింపు బాధ్యతలలో భాగస్వామ్యమవుతారన్నారు.
ప్రియాంక సభలో జూపల్లి, వనపర్తి MPP మేఘారెడ్డి, MLC కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి పార్టీలో చేరుతారని తెలిపారు. అలాగే ఇప్పటికే పార్టీలో చేరిన గద్వాల జడ్పి చైర్మన్ సరితా తిరుపతయ్య, ఆ జిల్లా సర్పంచ్ లు భారీగా సభకు హాజరవుతారన్నారు. కాంగ్రెస్ నుండి నేతలు BRS కి వెళ్లే ఆలోచన ఎవరికీ లేదన్నారు.
PCC ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ ఉదయపూర్ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇస్తామని PCC చెప్పిందని, దీనిని ఆహ్వానిస్తున్నామని, సదరు బీసీలకు ఇచ్చే 40 స్థానాలను వెంటనే ఐడెంటిఫై చేయాలన్నారు.
బీసీ అభ్యర్థులను ముందే ప్రకటిస్తే వారు ఇప్పటి నుంచే తమ నియోజకవర్గాల్లో గెలుపు కోసం పని చేసుకుంటారన్నారు. పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించాలని కోరుతున్నామన్నారు.
ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బెల్లయ్య నాయక్ మాట్లాడుతు మణిపూర్ వెనుక కుట్ర కోణంపై ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 29 వ తేదీ ప్రకాశం హాల్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే, PCC చీఫ్ రేవంత్, CLP నేత భట్టిలు హాజరుకానున్నారని తెలిపారు.