విధాత: పరువు నష్టం కేసులో తనకు జైలు శిక్ష విధించడానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఒకటి రెండు రోజులలో అప్పీలు చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు ఈ నెల 23న దోషిగా నిర్ధారించి, రెండేండ్ల జైలు శిక్ష విధించింది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా పై కోర్టుకు అప్పీలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దొంగలందరికీ ఇంటి పేరు మోదీ అనే ఉంది అంటూ రాహుల్ గాంధీ చమత్కారంగా చేసిన వ్యాఖ్యపై కోర్టు శిక్ష విధించింది.
కర్ణాటక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ అప్పీలు చేయడంలో జాప్యం చేస్తున్నదని బీజేపీ విమర్శించింది. అయితే తమకు 30 రోజుల వ్యవధి ఉన్నదని, ఎప్పుడు అప్పీలు చేయాలో తమకు తెలుసు అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.
హైకోర్టు కనుక రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టే ఇచ్చినట్టయితే, ఆయన లోక్ సభ సభ్యత్వ పునరుద్ధరణ జరుగుతుంది. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వ రద్దు పై కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నది.
రాహుaHకు మద్దతుగా 19 రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రతిపక్షాల మధ్య పలు చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయి. లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం వల్ల రాహుల్ గాంధీకి మద్దతు అనూహ్య స్థాయిలో పెరిగిపోయింది.