Site icon vidhaatha

MLA Raja Singh: రాజాసింగ్ సంచలనం..గోవధ అంశంపై వీడియో!

బెక్ పై తిరుగుతూ ఆవులు, ఎద్దుల అమ్మకాల చిత్రీకరణ
బక్రీద్ సందర్భంగా గోవధ ఆపాలంటూ డిమాండ్

విధాత, హైదరాబాద్ : హిందుత్వం..సనాతన ధర్మ విధానాలపై తన గళాన్ని గట్టిగా వినిపించే బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం గోవధ సమస్య తీవ్రతపై సంచలన వీడియో విడుదల చేశారు. బైక్ పై ప్రయాణిస్తూ పాతబస్తీ ప్రాంతంలో బక్రీద్ సందర్భంగా వధించేందుకు విక్రయానికి సిద్దంగా ఉన్న ఆవులు, ఎద్దుల దృశ్యాలను స్వయంగా చిత్రీకరించి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఆ వీడియోలు మంచి ఆరోగ్యంతో ఉన్న..వ్యవసాయ యోగ్యమైన..పాలదిగుబడులకు అనువైన ఎద్దులు, ఆవులు సైతం వధించేందుకు విక్రయించడం కనిపించింది. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటరీ నియోజకవర్గంలో బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో వధ కోసం ఆవు దూడలను అక్రమంగా విక్రయిస్తున్న దృశ్యాలను ప్రజలు, ప్రభుత్వం ముందుంచుతున్నానని తెలిపారు. హిందువులకు పవిత్రమైన ఆవుదూడలను బక్రీద్ పండుగ సందర్భంగా వధ కోసం అమ్ముతున్నారని..ఇది జంతు సంరక్షణ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, సుప్రీంకోర్టు ఆదేశాలను భేఖాతర్ చేయడమేనని రాజాసింగ్ తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు, పోలీస్ శాఖ గోవధ నిషేధ చట్టాలు అమలు చేసి..గోవధను ఆపాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. నగరంలోని తలబ్కట్ట, భవానీ నగర్, చంద్రాయణగుట్టఇంజన్‌బోలి, బాబా నగర్, బహదూర్‌పురా, సంతోష్ నగర్, యాకుత్‌పురా, గోల్కొండ, జీరా ప్రాంతాల్లో గోవధకు అమ్మకానికి పెట్టిన ఆవులు, ఎద్దులను వీడియోలో చూపించామని తెలిపారు. గోవధ సమస్య జంతు సంక్షేమ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా, మత సామరస్యానికి విఘాతం కల్గించేదిగా ఉందన్నారు. మీడియా కూడా ఈ సమస్యపై సహకరించి హిందువుల మనోభావాలను గౌరవించేలా చూడాలని..గోవధ నిషేధానికి సహకరించాలని రాజాసింగ్ కోరారు.

Exit mobile version