విధాత: అయోధ్య: ఇన్నాళ్లూ రామ్‌లల్లా అని పిలుచుకున్న బాల రాముడి పేరును మార్చేశారు. ఇకపై అయోధ్యలోని రామాలయంలో కొత్త రామ్‌లల్లా విగ్రహాన్ని బాలక్ రామ్ అనే పేరుతో పిలుస్తారు. ఆలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం ఐదేళ్ల వయసున్న రాముడిని తలపించేదిగా ఉన్నందున బాలక్ రామ్ అని పిలవాలని నిర్ణయించినట్టు ఆలయ పూజారి, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ దీక్షిత్ తెలిపారు. తాను మొదటిసారి ఆ విగ్రహాన్ని చూడగానే గొప్ప అనుభూతికి లోనయ్యానని, కండ్ల వెంట ఆనంద బాష్పాలు రాలాయని చెప్పారు. ఆ సమయంలో తాను అనుభవించినది మాటల్లో వర్ణించలేనని అన్నారు.
ఇప్పటికి తాను 50 నుంచి 60 విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అన్నింటిలోకి దివ్యమైనది ఇదేనని ఆయన చెప్పారు. జనవరి 18వ తేదీన తాను ఆ విగ్రహాన్ని మొదటిసారి చూశానని తెలిపారు. ఇదిలా ఉంటే.. రాముడికి అలంకరించిన ఆభరణాలను రామచరిత మానస్, వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణ్, అళవందర్ స్ర్తోత్రం వంటివాటిని లోతుగా పరిశోధించి చేయించామని రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేర్కొన్నది. వీటిని లక్నోకు చెందిన హర్షయిమల్ షియామ్‌లాల్ జ్యూయలర్స్ తయారు చేశారు.