లోక్‌సభ ఎన్నికలకు పార్టీల సన్నాహాలు

అసెంబ్లీ ఎన్నికల అలుపు తీరకముందే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుకోసం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తును మొదలు పెట్టనున్నాయి.

  • Publish Date - January 2, 2024 / 11:47 AM IST
  • రేపు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం
  • ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై చర్చ
  • కసరత్తు మొదలు పెట్టిన గులాబీ సైన్యం
  • నేటి నుంచి సెగ్మెంట్‌ల వారీగా సమీక్షలు
  • సీట్ల పెంచుకునే ఆరాటంలో కమలదళం


విధాత : అసెంబ్లీ ఎన్నికల పోరులో ఎదురైన జయాపజయాల నుంచి తేరుకొనకముందే తెలంగాణలోని రాజకీయ పక్షాలు లోక్‌సభ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. మార్చిలోగా లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముండటంతో రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌, బీజేపీలు ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచాయి. గెలుపు వ్యూహాల రూపకల్పనలో కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుండగా, ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీ హాజరవుతున్నారు.


పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, నామినేటెడ్ పదవుల భర్తీ సహా పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే గెలిచింది. ఈ దఫా రాష్ట్రంలో అధికార పార్టీగా మెజార్టీ సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయం ప్రభుత్వ వ్యతిరేకతతో కాకుండా కాంగ్రెస్‌కు లభించిన ప్రజాదరణకు లభించిందనే విషయాన్ని ఆ పార్టీ రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే రాష్ట్రం నుంచి మెజార్టీ సీట్లు గెలిచి పార్టీ నుంచి ప్రధాని రేసులో ఉన్న రాహుల్‌గాంధీకి కానుకగా అందించాలని పీసీసీ భావిస్తున్నది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌ మినహా ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ భారీగా సీట్లు గెలుచుకోవడంతో ఎంపీ ఎన్నికల్లో టికెట్లకు డిమాండ్ కూడా పెరిగింది. దీంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ నాయకత్వానికి జటిలంగా మారింది.


నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఆ స్థానాలతోపాటు ఆదిలాబాద్‌, నిజమాబాద్‌, జహీరాబాద్‌, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ పైచేయి సాధించిన మల్కాజిగిరి, మెదక్‌, చేవెళ్ల, సికింద్రాబాద్ స్థానాల్లోనూ గెలువాలని కాంగ్రెస్‌ కసరత్తు చేస్తున్నది.


లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకునేందుకు బీఆరెస్ సన్నాహాలు


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన బీఆరెస్.. లోక్‌సభ ఎన్నికల్లో జుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల సమరానికి ముందస్తు కసరత్తు చేపట్టింది. పార్టీ కేడర్‌ను లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు బుధవారం నుంచి 12వ తేదీ వరకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్ వేదికగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, నేతలు హరీశ్‌రావు, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి సారథ్యంలో లోక్‌సభ సన్నాహక సమావేశాలు కొనసాగనున్నాయి.


అదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంతో మొదలుపెట్టనున్న సన్నాహక సమావేశాలు వరుసగా సంక్రాంతి పండుగ విరామం తర్వాతా కూడా కొనసాగనున్నాయి. 4న కరీంనగర్‌, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజమాబాద్‌, 8న జహీరాబాద్‌, 9న ఖమ్మం, 10న వరంగల్‌, 11న మహబూబాబాద్‌, 12న భువనగిరి, 16న నల్లగొండ, 17న నాగర్ కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్‌, 20న మల్కాజిగిరి, 21న సికింద్రాబాద్‌, హైద్రాబాద్ నియోజకవర్గాల సన్నాహాక, సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.


గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పోయిన ప్రతిష్ఠను లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి తిరిగి సాధించాలని అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ ముఖ్యులంతా వ్యూహాలపై ఫోకస్ పెట్టనున్నారు. లోక్‌సభ స్థానాల వారీగా జరుగనున్న ఈ సన్నాహక సమావేశాలకు సిటింగ్ ఎంపీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతోపాటు లోక్‌సభ స్థానం పరిధిలోని ముఖ్య నాయకులను ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు గత పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, సీట్లపైన.. స్వల్ప మెజార్టీతో ఓడిన స్థానాలపైన కూలంకషంగా చర్చించనున్నారు.


రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఎదురవ్వనున్న పోటీని అధిగమించి గెలువడం ఎలాగన్నదానిపై వ్యూహ రచన చేయనున్నారు. లోక్‌సభ స్థానాలవారీగా సన్నాహక సమావేశాలు ముగిసిన అనంతరం అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా కూడా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని గులాబీ నాయకత్వం నిర్దేశించుకున్నట్టు తెలుస్తున్నది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై ధీమాను కల్గించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నది.


గెలుపు గుర్రాల అన్వేషణ


అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో పక్కాగా గెలువగలిగే సామర్థ్యం ఉన్నవారినే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించాలని కేసీఆర్ తలపోస్తున్నారని సమాచారం. సారు.. కారు.. పదహారు నినాదంతో ఎన్నికల బరిలో తలపడిన బీఆరెస్‌ గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. తాజా ఎన్నికలకు ఇప్పటికే చేవెళ్ల, జహీరాబాద్‌, ఖమ్మం సిటింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు ఖాయం చేసిన కేసీఆర్ వారిని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.


నిజామాబాద్‌కు కవితను, కరీంనగర్‌కు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను, అదిలాబాద్‌కు గెడం నగేశ్‌కు టికెట్లు దాదాపు ఖాయం కావడంతో వారు కూడా ఎన్నికల సన్నాహాల్లో ఉన్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లలో అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఎమ్మెల్యేల స్థానాలు, పడిన ఓట్ల నేపథ్యంలో పార్టీ నుంచి చాలా మంది టికెట్ రేసులో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో మెదక్‌లో సిటింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలువడంతో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సివుంది.


ఈ టికెట్ కోసం నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి రంగంలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా దక్కని లోక్‌సభ స్థానాలు పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, ఖమ్మంతోపాటు ఉత్తర, దక్షిణ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడిచిన నల్లగొండ, భువనగిరి, వరంగల్‌, మహబూబ్‌బాద్‌(ఎస్టీ), మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్‌, కరీంనగర్‌, నిజమాబాద్‌, అదిలాబాద్‌, పెద్దపల్లి స్థానాల్లో బీఆరెస్ గెలుపు కోసం తీవ్రంగానే శ్రమించాల్సివుంది.


మళ్లీ అసమ్మతులా?


ఆయా లోక్‌సభ స్థానాల్లో ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండటం అసమ్మతిని రగిలించే అవకాశం ఉన్నదన్న చర్చ నడుస్తున్నది. దీనిని అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందనే ఆసక్తికరంగా మారింది. తాజాగా నల్లగొండలో గుత్తా సుఖేందర్‌రెడ్డి తన తనయుడు అమిత్‌రెడ్డికి టికెట్ అడుగుతుండగా అక్కడ ఆయన వ్యతిరేకులు మోకాలడ్డుతున్నారు. ఇదే తరహా అసమ్మతి రాజకీయాలు, బహుళ సంఖ్యలో టికెట్ ఆశావహుల పంచాయతీలు ఇతర నియోజకవర్గాల్లోనూ ఉండటంతో బీఆరెస్ నాయకత్వానికి అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఇబ్బందికరంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.


10 సీట్లపై కమల దళం ఫోకస్‌


అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పెంచుకున్న బీజేపీ ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాలపై భారీ ఆశలే పెట్టుకుంది. తాజాగా అమిత్ షా తెలంగాణలో పర్యటించి రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి లోక్‌సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శకం చేశారు.లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై ఈ నెల 7, 8 తేదీల్లో పార్టీ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ టీమ్ సమావేశం జరగనుందని రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. సిటింగ్ ఎంపీ స్థానాలు కరీంనగర్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌లలో తిరిగి బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, అర్వింద్‌, సొయం బాపురావులను మళ్లీ బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. మిగతా 13 స్థానాల్లో కనీసం 6 నుంచి 7స్థానాలు గెలువాలని బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి నిర్దేశించింది. ఆ స్థానాల్లో టికెట్ల కోసం పార్టీ నాయకుల నుంచి గట్టి పోటీ నెలకొందని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో స్టేట్ ఎలక్షన్ టీమ్ సమావేశం జరగనుందని కిషన్ రెడ్డి ఇవాళ మీడియాతో చిట్ చాట్ తెలిపారు.


ముఖ్యంగా అదిలాబాద్ లోక్‌సభ పరిధిలో నాలుగుసీట్లు, నిజామాబాద్‌లో రెండు సీట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలువడంతో బీజేపీ ఇక్కడ గెలుపుపై ధీమాగా ఉంది. మల్కాజిగిరి టికెట్ రేసులో జాతీయ కార్యవర్య సభ్యుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, కూన శ్రీశైలంగౌడ్‌, పేరాల శేఖర్‌రావు, డాక్టర్ ఎస్‌ మల్లారెడ్డి, టీ వీరందర్‌గౌడ్‌, సామ రంగారెడ్డి పోటీ పడుతున్నారు. వరంగల్ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్‌, జహీరాబాద్ నుంచి ఎన్నారై ఏలేటి సురేశ్‌రెడ్డి, చీకోటి ప్రవీణ్‌, రచనారెడ్డి, చీకోటి ప్రవీణ్‌, రాజాసింగ్‌ టికెట్ రేసులో ఉన్నారు.


నాగర్ కర్నూల్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, టీ ఆచారి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మెదక్ నుంచి ఎం రఘునందన్‌రావు, భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు పరిశీలనలో ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంత్‌రావు కూడా ఉన్నారు. నల్లగొండ నుంచి జితేంద్రకుమార్‌, జీ మనోహర్‌రెడ్డి, మహబూబ్‌బాద్‌లో తేజావత్ రామచంద్రనాయక్‌, హుస్సేన్‌ నాయక్‌, ఖమ్మం నుంచి గరికపాటి మోహన్‌రావు, గల్లా సత్యనారాయణ, రంగాకిరణ్‌, పెద్దపల్లి నుంచి సోగల కుమార్‌ పోటీ పడుతున్నారు.