Phone tapping case | మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు రిమాండ్ పొడిగింపు

  • Publish Date - April 10, 2024 / 12:35 PM IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు నిర్ణయం

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case)లో నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్సు మాజీ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు జ్యూడిషియల్ కస్టడీని నాంపల్లి కోర్టు శుక్రవారం వరకు పొడిగించింది. వారం రోజుల కస్టడీ బుధవారం ముగిసిపోవడంతో రాధాకిషన్‌రావును ఉదయం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ నెల 12వరకు జ్యూడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్ రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని తెలిపారు. దీంతో పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు రిమాండ్ విధించిన అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.

ప్రత్యేక పీపీల నియామకానికి చర్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల సంఖ్య పెరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం తరుపున వాదించేందుకు ప్రత్యేక పీపీలను నియమించేందుకు చర్యలు చేపట్టింది. పీపీలుగా నియమించేందుకు సీనియర్ న్యాయవాదుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ కేసులో ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావుతో పాటు మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేశారు. మరికొందరిని విచారించారు. ఈ కేసులో మునుముందు గత ప్రభుత్వంలోని బీఆరెస్ పెద్దలను కూడా విచారించనున్న క్రమంలో ప్రత్యేక పీపీల నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

Latest News