విధాత, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయదుందుభి మోగించిన సందర్భంగా ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారికి ఘన నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తూ, రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి కృజ్ఞతగా ప్రజలు తీర్పును ఇచ్చారని అన్నారు.
ఈ విజయంలో 30 లక్షలమంది నిరుద్యోగుల కృషి ఉన్నదని చెప్పారు. ప్రజల ఆకాంక్షల అమలులో కాంగ్రెస్‌కు మరింత బాధ్యత పెంచారని అన్నారు. జోడోయాత్రతో దేశవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో 21 రోజులు పర్యటించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ స్పూర్తిగా నిలిచి, తెలంగాణ ప్రజల్లో పార్టీపై ఆత్మవిశ్వాసం కలిగించారని తెలిపారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల్లో ఒకరిగా, కుటుంబంలో మేమూ సభ్యులమే అంటూ రాహుల్, ప్రియాంకా గాంధీ విశ్వాసం, నమ్మకం కలిగించారని అన్నారు.
సీనియర్లతో కలసి విజయాన్ని అందుకున్నాం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అంతా సమిష్టిగా కృషి చేయడంతోనే ఈ విజయాన్ని అందుకున్నామన్న రేవంత్ రెడ్డి, సీఎల్పీనేత భట్టి, టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో పార్టీని కష్టకాలంలో ముందుకు నడిపించామన్నారు. పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు, జానారెడ్డి, ఉత్తం రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, మధుయాష్కి, విజయశాంతి అందరి సహకారంతో ఈ రోజు ఈ విజయాన్ని సాధించామని పేర్కొన్నారు.
తెలంగాణ అమరవీరులకు విజయాన్ని అంకితమిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి, ఈ ప్రాంత అభివృద్ధి, మానవ హక్కుల పునరుద్ధరణకు కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రజలు హక్కులు, పౌర హక్కులను కాపాడుతామన్నారు. కాంగ్రెస్ గెలుపును కేటీఆర్ అభినందించారని, దీన్ని పీసీసీ స్వాగతిస్తున్నదన్నారు.
కూటమితో ముందుకు..
కాంగ్రెస్ ప్రభుత్వంలో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల ఆలోచనలు పరిగణనలోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల అమలుతో పాటు రాహుల్ మాటను నిలబెడుతామన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీ స్థానాన్ని ప్రజలు నిర్ణయించారన్నారు. కొత్త ప్రభుత్వంలో ప్రజలు కన్న కలల అమలుకు బీఆరెస్ అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత పరిస్థితులు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని హితవు పలికారు.
ఇక ప్రజా భవన్..
ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కూటమి పార్టీ సీనియర్లు అందరి సహకారంతో ముందుకు పోతామని రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్త ప్రభుత్వంతో సచివాలయం గేట్లు అందరికీ తెరుచుకుంటాయని అన్నారు. ప్రగతి భవన్ పేరును మారుస్తున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి… ఇకపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజాభవన్‌గా అది ఉంటుందని తెలిపారు.
తెలంగాణలో గతానికి పూర్తి భిన్నంగా రేపటి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో ప్రజలు నిర్ణయించారని, కొత్త ప్రభుత్వంలో బీఆరెస్ సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. పార్టీలో ఏ సమస్య వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.