భార‌త్ అంత‌రిక్షంలో ప్రైవేటు హ‌వా. . 2023లో స్టార్ట‌ప్‌ల్లోకి రూ.1000 కోట్ల పెట్టుబ‌డులు

భార‌త అంతరిక్ష రంగంలో 2023 సంవ‌త్స‌రం అనేక అద్భుతాల‌ను అందించింది.

  • Publish Date - January 1, 2024 / 10:12 AM IST

భార‌త అంతరిక్ష రంగం (Indian Space Industry) లో 2023 సంవ‌త్స‌రం అనేక అద్భుతాల‌ను అందించింది. చంద్ర‌యాన్ 3, ఆదిత్య ఎల్‌1 వంటి విజ‌యాల‌తో పాటు ఈ రంగం మ‌రో ఎత్తుకు ఎద‌గ‌డానికి త‌గిన ప‌రిస్థితులు ఈ ఏడాదే కుదిరాయి. కేంద్ర ప్ర‌భుత్వం అంత‌రిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబ‌డులను ప్రోత్స‌హించ‌డంతో ఈ ఏడాది కొత్త‌గా 54 స్టార్ట‌ప్‌లు ప్రారంభ‌మ‌య్యాయి. త‌ద్వారా ఈ రంగంలో ప్రైవేటు సంస్థ‌ల సంఖ్య 204కు చేరింది. ఈ ఒక్క ఏడాది స్పేస్ స్టార్ట‌ప్‌ (Startups) లు రూ.1031.86 కోట్ల రూపాయ‌ల ఫండింగ్‌ను అందుకోవ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా ఈ స్టార్ట‌ప్‌లో పెట్టుబ‌డి ప‌రిమాణం రూ.3203.77 కోట్ల‌కు చేరింది.


ఈ మేర‌కు భార‌త అంత‌రిక్ష రంగ సంస్థ ఇండియ‌న్ స్పేస్ అసోసియేష‌న్ (ఐఎస్‌పీఏ) త‌న నివేదిక‌లో పేర్కొంది. ఇండియ‌న్ స్పేస్ స్టార్ట‌ప్‌లు.. ప్రైవేటు అంత‌రిక్ష సంస్థ‌ల‌కు బ‌ల‌మైన పునాదుల్లాంటివి. 2020లో కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటు సంస్థ‌ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో వీటి ప్రాధాన్యం మ‌రింత పెరిగింది అని ఐఎస్‌పీఏ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్.. రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జ‌న‌ర‌ల్ ఏకే భ‌ట్ వివ‌రించారు. 2020 వ‌ర‌కు అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు చేయ‌డం, రాకెట్ల డిజైన్‌, అభివృద్ధి, వాటిని ప్ర‌యోగించ‌డం వంటి ప‌నుల‌న్నీ పూర్తిగా ఇస్రో చేతిలోనే ఉండేవి. దీంతో స్టార్ట‌ప్‌లు, ఇత‌ర ప్రైవేటు సంస్థ‌ల‌న్నీ విడిభాగాల స‌ర‌ఫ‌రాదారులుగా మాత్ర‌మే ఉండేవి.


ఈ సంస్థ‌ల‌ను కూడా ప‌రిశోధ‌న‌లు, ప్ర‌యోగాల‌లో భాగం చేయాల‌నే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం 2020లో అంత‌రిక్ష‌రంగంలోకి ప్రైవేటు పెట్టుబ‌డుల‌ను, భాగ‌స్వామ్యాన్ని ఆహ్వానిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీటి విధివిధానాలు, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ఇవ్వ‌డానికి ఇండియ‌న్ నేష‌న‌ల్ స్పేస్ ప్ర‌మోష‌న్ అండ్ అథ‌రైజేష‌న్ సెంట‌ర్ (స్పేస్‌)ను ఏర్పాటు చేసింది. త‌ద‌నంత‌ర కాలంలో భార‌తీయ స్పేస్ స్టార్ట‌ప్‌లు సాధించిన కొన్ని విజ‌యాల‌ను ఐఎస్‌పీఏ గుర్తుచేసింది. ధ్రువ స్పేస్ సంస్థ త‌న 3యూ, 6యూ శాటిలైట్ ఆర్బిటల్ డిప్లాయ‌ర్‌ల‌ను ప్ర‌యోగ ఇంచ‌గా.. ధ్రువ స్పేస్ శాటిలైట్ ఆర్బిట‌ర్ లింక్ (డీఎస్ఓఎల్‌)ను ఇస్రో పీఎస్ఎల్వీ సీ55 ద్వారా అంత‌రిక్షంలోకి పంపించింది.


అజిస్టా బీఎస్‌టీ అనే స్టార్ట‌ప్‌.. త‌న తొలి ఉప‌గ్ర‌హం ఏబీఏ ఫ‌స్ట్ ర‌న్న‌ర్‌ను స్పేస్ ఎక్స్ సాయంతో ప్ర‌యోగించింది. హైద‌రాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్.. భార‌త్‌లోనే అత్యంత పెద్ద ప్రైవేటు రాకెట్ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏడంత‌స్తుల ఎత్తైన మ‌ల్టీ స్టేజ్ లాంచ్ వెహిక‌ల్ విక్ర‌మ్‌-1ను రూపొందించింది. దీని ద్వారా దిగువ భూ క‌క్ష్య‌లో 300 కేజీల ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు వీలుంటుంది. చెన్నై కేంద్రంగా ప‌నిచేసే అగ్నికుల్ కాస్మోస్ సంస్థ కూడా ఒక రాకెట్ ప్ర‌యోగ వేదిక‌ను నిర్మించింది.