టీ 20 ప్ర‌పంచ క‌ప్ నుండి ఈ స్టార్ ప్లేయ‌ర్స్‌ని త‌ప్పిస్తున్నారా.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారే..!

  • Publish Date - April 10, 2024 / 12:52 PM IST

ప్ర‌స్తుతం ఐపీఎల్ హంగామా కొన‌సాగుతుంది. ధనాధ‌న్ టోర్నీలో అద‌ర‌గొట్టిన ఆట‌గాళ్ల‌ని టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కి సెల‌క్ట్ చేసేందుకు సెల‌క్ట‌ర్స్ ప‌క్కా ప్రణాళిక‌లు ర‌చిస్తున్నారు. టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో ఈ సారి రింకూ సింగ్‌కి స్థానం ప‌దిలం అయిన‌ట్టే అని అంద‌రు అనుకున్నారు. కాని ఆయ‌న వ‌రుస వైఫ‌ల్యాల‌లతో త‌న స్థానాన్ని క్లిష్టం చేసుకుంటున్నాడు. ఐపీఎల్ సీజ‌న్ 17లో రింకూ సింగ్ 23, 5 నాటౌట్, 26, 9 పరుగులు చేశాడు. త‌న మార్క్ ఇన్నింగ్స్ ఒక్క‌టి కూడా ఆడ‌లేదు. సోమవారం చెపాక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ దారుణంగా తేలిపోయాడు. 14 బంతులాడి ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 9 పరుగులు చేసి పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. ఈ వైఫల్యాలు రింకూకి టీ20 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను సంక్లిష్టం చేస్తుంది అని చెప్పాలి.

అగ్రరాజ్యం అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌స్ట్‌లో మిస్ అయింది కావున ఈ సారి టీ20 ప్ర‌పంచ క‌ప్ త‌ప్ప‌నిస‌రిగా ద‌క్కించుకోవాల‌ని క‌సిగా ఉంది భార‌త్. ఈ విష‌యంలో జట్టు ఎంపికపై బీసీసీఐ కూడా కసరత్తులు ప్రారంభించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు 30 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ 30 మంది ఆట‌గాళ్లు ఐపీఎల్‌లో ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నారో ప‌రిశీలించి ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆటపై సెలెక్టర్లు ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. అందుకు కార‌ణం అమెరికా, వెస్టిండీస్ పిచ్‌లు.. చెన్నైలోని చెపాక్ వికెట్‌కు దగ్గరగా ఉంటాయి.

దానిపై రాణించి ఉంటే రింకూని సెలక్ట్ చేసే విష‌యంలో సెల‌క్ట‌ర్స్‌కి ఈజీగా ఉండేది. ప్ర‌స్తుతం కేకేఆర్‌కి ఆడుతున్న రింకూ చెపాక్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో 9వ ఓవర్‌లోనే రింకూ సింగ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. సెలెక్టర్ల ధృష్టిని ఆకర్షించేందుకు రింకూ సింగ్‌కు ఇది స‌రైన అవ‌కాశం అని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం అభిప్రాయపడ్డాడు. కానీ స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై రింకూ సింగ్ దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. దాంతో గోల్డెన్ ఛాన్స్ అత‌నికి మిస్ అయింద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ఈ సీజ‌న్‌లో రింకూతో పాటు యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లంతా పెద్ద‌గా రాణించ‌లేక‌పోతున్నారు. దీంతో ద్రవిడ్, అగార్కర్ ఎవ‌రిని ఎంపిక చేసి తీసుకెళ్లాలా అని త‌ర్జ‌న భర్జ‌న ప‌డుతున్నారు.

Latest News