Rivaba Jadeja | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జడేజా భార్య రివాబా జడేజా మూడేండ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తొలి విడుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇవాళ భేటీ కానుంది. అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. ఆ జాబితాలో రివాబా జడేజా పేరు ఉండనున్నట్లు సమాచారం.
రివాబా జడేజా మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ హరి సింగ్ సొలంకికి దగ్గరి బంధువు. రవీంద్ర జడేజాను రివాబా 2016లో పెళ్లి చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో హార్దిక్ పటేల్, అల్పేశ్ థాకూర్‌లు కూడా బీజేపీ నుంచి పోటీపడే ఛాన్సు ఉంది. వీరి పోటీపై ఇవాళ సాయంత్రానికి ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నారు.
ఈ ఎన్నికల్లో 75 సంవత్సరాలు నిండిన నాయకులకు టికెట్ ఇవ్వడం లేదు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు టికెట్లు ఇవ్వకపోవచ్చు. గుజరాత్‌లో 27 ఏండ్ల నుంచి బీజేపీ పాలన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఆప్ గట్టి పోటీని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.