విధాత: ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో సినిమా తరహాలో దొంగల వేట జరిగింది. ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు పోలీస్ బృందం వెళ్లగా వారిపై దొంగలు కాల్పులు జరిపారు. వారి కాల్పుల్లో సబ్-ఇన్‌స్పెక్టర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు దొంగల కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఘోరా గ్రామ సమీపంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి చోటుచేసుకున్నది.
అదనపు పోలీసు సూపరింటెండెంట్ హరేంద్ర కుమార్ వివరాల ప్రకారం.. అమేథి జిల్లాలోని టిక్రీ సమీపంలో డిసెంబర్ 30న జరిగిన రూ.4 లక్షల దోపిడీ కేసులో ఇద్దరు దొంగల గురించి పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి ఘోరా గ్రామ సమీపంలో ఇద్దరు దొంగలు ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. వారిని అరెస్టు చేసేందుకు పోలీస్ బృందం వెళ్లింది.
తమను పోలీసులు చుట్టుముట్టినట్టు గుర్తించిన నేరస్థులు పోలీసులపై కాల్పులు జరిపారు. దొంగలు జరిపిన కాల్పుల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ శివ్ బక్ష్ సింగ్ చేతికి గాయమైంది. పోలీసులు ఇద్దరు దొంగల కాళ్లపై కాల్చి అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద రూ. 3.50 లక్షల నగదు, కంట్రిమేడ్ పిస్టల్, కొన్ని కాట్రిడ్జ్‌లు, మోటారు సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వైద్య చికిత్స నిమిత్తం అమేథిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.