Sachin Pilot
- విలువల విషయంలో రాజీ లేదు
- దేశంలో, రాష్ట్రంలో అవినీతి ఉండొద్దు
- తండ్రి సంస్మరణ సభల్లో సచిన్‌పైలట్
దవుసా: కొంతకాలంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు కొరకరాని కొయ్యగా తయారైన యువ నేత, ఉప ముఖ్యమంత్రి సచిన్‌పైలట్.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. తన తండ్రి, దివంగత కాంగ్రెస్ నేత రాజేశ్‌పైలట్ వర్థంతిని పురస్కరించుకుని కొత్త పార్టీ ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే.. పైలట్ మాత్రం తన తండ్రకి నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరై.. వెళ్లిపోయారే కానీ.. ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
దవుసాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సచిన్.. మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజె పరిపాలనా కాలంలో చోటు చేసుకున్న అవినీతి, రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించి జరిగిన పరీక్షల సందర్భంగా పేపర్ లీకేజీ ఆరోపణపై తాను వెనక్కు తగ్గేది లేదని మాత్రం చెప్పారు. ‘నా రాజకీయ లక్ష్యం చాలా స్పష్టంగా ఉన్నది.
దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు పరిశద్ధంగా ఉండాలన్నదే నా ఉద్దేశం. అవినీతికి ఆస్కారం ఉండ కూడదు. యువత కలలు ఛిద్రమైపోకూడదు’ అని సచిన్ పైలట్ చెప్పారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నానన్న సచిన్.. రాజకీయాల్లో తన అభిప్రాయాలను మరింత గట్టిగా వినిపిస్తానని, విలువల విషయంలో రాజీపడేదే లేదని చెప్పడం గమనార్హం.
తన ప్రసంగంలో ఎక్కడా ముఖ్యమంత్రి గెహ్లాట్ పేరును ప్రస్తావించని సచిన్.. ఆయనపై మాత్రం చురకలు అంటించారు. రాజె హయాంలో జరిగిన అవినీతిని, ప్రత్యేకించి మైనింగ్ కాంట్రాక్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి తప్పుకీ శిక్షలుంటాయన్నారు.. పేపర్ లీకేజీలో నష్టపోయిన విద్యార్థులకు పరిహారం ఇస్తామన్నారు.. ఎక్కడ? అని గెహ్లాట్‌ను పరోక్షంగా ప్రశ్నించారు.
రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని సచిన్ ఆశించినా.. అధిష్ఠానం మాత్రం గెహ్లాట్‌కే అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి గెహ్లాట్‌పై ఆయన పరోక్షంగా విరుచుకు పడుతూనే ఉన్నారు. తనకు ఎలాంటి పదవి ఉన్నా లేకున్నా.. ప్రజల్లో విశ్వసనీయతను కలిగి ఉండటమే తనకు అత్యంత ముఖ్యమని పైలట్ చెప్పారు.
‘ఇవాళ కాకపోతే రేపైనా మనకు న్యాయం జరుగుతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే.. అందరికీ న్యాయం జరుగుతుందని నేను హామీ ఇస్తున్నా. నేను మీకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి నా పోరాటం కొనసాగిస్తా’ అని స్పష్టం చేశారు.