వరుసబెట్టి పేర్లు మార్చేస్తున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పుడు గాంధీ పేరిట ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు కూడా మర్చివేసేందుకు సిద్ధమైంది. గాంధీ పేరును తొలగించి.. పొడి అక్షరాల్లో ‘రామ్‌జీ’ అని వచ్చేలా కొత్త పేరును ప్రతిపాదించనున్నది. ఈ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లును పెట్టబోతున్నది. ఈ పథకం పేరు గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లు 2025గా మారనున్నది. ప్రస్తుతం వంద రోజులు పనిదినాలు కల్పిస్తుండగా ఇక నుంచి 125 రోజుల పాటు దరఖాస్తు చేసుకున్నవారికి పని కల్పించనున్నారు. నిధులు సమకూర్చడంలో తన బాధ్యతను తగ్గించుకుంటూ.. రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం చేసింది. కొత్త బిల్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం వాటా సమకూర్చాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాలలో ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలు 10 శాతం వాటా సమకూర్చుకుంటే సరిపోతుంది. నిధుల వ్యయం, పనులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ గ్రామీణ్ రోజ్ గార్ గ్యారెంటీ కౌన్సిల్ ను కేంద్ర స్థాయిలో, రాష్ట్రాలలో స్టేట్ రోజ్ గార్ గ్యారెంటీ కౌన్సిల్ ఏర్పాటు కానున్నది. నిధుల వ్యయం, పరిపాలనా పరమైన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో స్టీరింగ్ కమిటీలు కూడా వేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే సమయంలో ఉపాధి హామీ పనులు అమలు తాత్కాలికంగా నిలిపివేసే అధికారం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగానే తేదీలను ప్రకటించి, ఆ తేదీలలో పనులు నిలిపివేస్తారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీల కొరత లేకుండా పోతుంది. మహిళలు, పెద్దవాళ్లు, దివ్యాంగులు, ఇతర సమస్యలు ఉన్నవారికి ప్రత్యేక కూలీ రేట్లను ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఉపాధి హామీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల వ్యవధిలో పని కల్పించనట్లయితే అలవెన్స్ ఇచ్చే విధంగా నిబంధన పెట్టారు. పనులు చేసిన వారికి 15 రోజుల లోపు డబ్బులు చెల్లించనట్లయితే 0.05 అపరాధ రుసుంతో కలిపి 16వ రోజు కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని నూతన బిల్లులో ప్రతిపాదించారు.
అయితే.. పథకం నుంచి గాంధీ పేరు తొలగించడంపై కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేరు తొలగింపు వెనుక ప్రభుత్వ ఉద్దేశాలను ఆమె ప్రశ్నించారు. పార్లమెంటు కాంప్లెక్స్ వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు? దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా మహాత్మాగాంధీని పరిగణిస్తారు. అలాంటి పేరును తొలగించడంలో ఉద్దేశం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు’ అన్నారు. ఒక పథకం పేరు మార్చినప్పుడు కార్యాలయాలు, స్టేషనరీ, ఇలా అనేక మార్పులు అవసరమవుతాయని, అందుకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. దీని వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. సమయం, ధనం వృథా అవడం తప్ప మరోటి లేదన్నారు.
ఇవి కూడా చదవండి :
OTT Movies | ఈ వారం ఓటీటీలో వినోద విందు.. స్ట్రీమింగ్‌కు రానున్న కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే!
Anil Ravipudi | చిరంజీవి మాటకే ఎదురు చెప్పిన అనిల్ రావిపూడి.. నెట్టింట ఇదే హాట్ టాపిక్
