కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గా అమరావతిని ఆమోదముద్ర వేసింది. జూన్ 2 వ తేదీ 2024 నుంచి ఇది అమలులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని కాదని విశాఖపట్నం ను రాజధానిగా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పై దృష్టి పెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున నిధులు సమీకరించి వేగంగా పనులు పూర్తి చేయిస్తున్నది. రాజధాని విషయంలో మరోసారి తప్పు జరక్కుండా ఉండేందుకు శాశ్వత చర్యలను చేపట్టింది. భవిష్యత్తులో రాజధాని నగరానికి న్యాయపరంగా చిక్కులు రాకుండా ఉండేందుకు అటార్నీ జనరల్ తో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది.
ఇప్పటి వరకు హైదరాబాద్ నగరం మాదిరి అమరావతికి ప్రత్యేకంగా పోస్టల్ పిన్ కోడ్, బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ, ఐఎస్డీ కోడ్ లు లేవు. రాజధాని నగరం అమరావతి అని గుర్తుండేలా ప్రత్యేకంగా పిన్ కోడ్ లు, ఎస్డీడీ కోడ్ లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ కేటాయించనున్నది. ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంస్థలు, కార్యాలయాలు ఇక నుంచి అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల జోనల్ కార్యాలయాలు, ఆర్బీఐ ప్రధాన కార్యాలయం భవనాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆడిటర్ జనరల్, మింట్, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, ఆర్కియాలాజికల్, పరిశోధనా సంస్థలు వంటి కార్యాలయాలు అమరావతి లోనే ఏర్పాటు అవుతాయి.
గతంలో వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్వం చేసేందుకు మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా, అమరావతిని లెజిస్లేచర్ క్యాపిటల్ గా, కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్ గా ఉంటాయని ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వివరించింది. దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఉన్న మూడు రాజధానుల నమూనా ను అనుసరిస్తున్నామన్నారు. మన దేశంలో మహారాష్ట్ర, కర్నాటక లో రెండు చోట్ల అసెంబ్లీ లు నిర్వహిస్తున్నారని వైసీపీ నాయకులు అప్పట్లో ప్రచారం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర ప్రాంతాల మధ్య యాస, భాషల్లో ఎప్పటి నుంచో తేడాలున్నాయని వాదించింది. ఇందుకు భౌగోళికరపరమైన వాతావరణం, నేల స్వభావం, సముద్ర తీరం వంటివి కూడా కారణాలు అని వెల్లడించింది. మధ్యాంధ్ర జిల్లాలు అయిన గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు ఎంతో అభివృద్ధి సాధించాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఇప్పటికీ వెనకబడి ఉన్నాయి. వాటిని కూడా సమంగా అభివృద్ధి చేయడానికే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 2020 లో ఏపీ అసెంబ్లీ ఈ ప్రతిపాదనకు సంబంధించి బిల్లును ఆమోదించగా, అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైసీపీ మినహా అన్నీ పార్టీలు ఉద్యమానికి మద్ధతు పలికాయి. భూములు కోల్పోయిన వేలాది మంది రైతులు, రాష్ట్ర ప్రజులు నిరసన కార్యక్రమాలు, పాదయత్రలు నిర్వహించారు. ఏపీ హైకోర్టు మూడు రాజధానుల ఏర్పాటును కొట్టివేయంతో వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో అప్పీల్ చేసింది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు రాజధానుల ముచ్చటకు ముగింపు పలికింది.
ఇవి కూడా చదవండి :
Medaram : రేపు మేడారంలో దర్శనాలు బంద్
Telangana Tops Liquor Spending : సౌత్ లిక్కర్ కింగ్ తెలంగాణ !
