Nitin Gadkari | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. తనకు నచ్చిన, నచ్చని విషయాలపై నిక్కచ్చిగా ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తలకెక్కారు. ఈ సారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు.
వీర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలతో వీర్ సావర్కర్‌ను ఇంటింటికి తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించారని పేర్కొంటు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. పరువు నష్టం కేసులో లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించగా.. ‘నేను సావర్కర్‌ను కాదు.. గాంధీని. గాంధీ ఎన్నడూ క్షమాపణలు చెప్పడు’ అన్నారు. దీనిపై బీజేపీతో పాటు శివసేన ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన వీర్ సావర్కర్ గౌరవ్ యాత్ర చేపడుతున్నాయి.
నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వీర్ సావర్కర్‌ను అవమానించారని, అయితే ఆయన వ్యాఖ్యలతో సావర్కర్ ఔన్నత్యం ఏమాత్రం తగ్గలేదన్నారు. సావర్కర్‌ను ఇంటింటికి తీసుకువెళ్లేందుకు అవకాశం దక్కిందన్నారు. సత్యాన్ని, సావర్కర్‌ను ప్రతి గడపకు తీసువెళ్లేందుకు అవకాశాన్ని అందించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
సావర్కర్ గురించి తన అమ్మమ్మ ఇందిరాగాంధీ, తాత ఫిరోజ్ గాంధీ ఏం చెప్పారో తాను చదవలేదని నితిన్ గడ్కరీ అన్నారు. గడ్కరీ మాట్లాడుతూ.. ‘హిందుత్వం ఒక జీవన విధానం అని సావర్కరే చూపించాడని, కులాల అడ్డుగోడలను బద్దలు కొట్టాడని గడ్కరీ తెలిపారు.
రాహుల్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. తాను క్షమాపణలు చెప్పనని రాహుల్ అంటుఉన్నారని, అంతే కాకుండా తాను సావర్కర్‌ను కాదని అన్నారని గుర్తు చేసిన ఆయన.. రాహుల్ సావర్కర్, గాంధీ కాలేరన్నారు.
సావర్కర్ కావాలంటే త్యాగాలు చేయాలన్నారు. సావర్కర్‌ను అండమాన్ జైలులో చీకటి గదిలో ఉంచారన్నారు. రాహుల్ గాంధీ ఆ గదిలో ఒక రోజు ఉండేందుకు ప్రయత్నించాలని, ఆయన కోసం ఏసీ సౌకర్యం కల్పిస్తామన్నారు.