India Vice President Election| విధాత, న్యూఢిల్లీ ప్రతినిధి : ఉప రాష్ట్రపతి పదవికి ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆగస్టు 17 సాయంత్రం న్యూఢిల్లీలో సమావేశం కానుంది. బీజేపీ ఖరారు చేసిన అభ్యర్థికి తాము మద్దతిస్తామని ఎన్ డీ ఏ భాగస్వామ్యపక్షాలు ఇప్పటికే హామీ ఇచ్చాయి. దీంతో అభ్యర్థి ఎంపికపై కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పుడు మళ్లీ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. భారతదేశ చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది.
ఉపరాష్ట్రపతి రేసులో వీరే..
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, కేంద్ర మంత్రులుగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, వీకే సక్సేనా, ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి పేర్లు ఉప రాష్ట్రపతి పదవి రేసులో వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్‌తో మంచి అనుబంధం ఉన్న వారిలో సీపీ రాధాకృష్ణన్, థావర్ చంద్, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ వంటివారు ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 1993 నుంచి 1998 వరకు ఆర్ఎస్ఎస్ ప్రాంత సంచాలక్ గా పనిచేశారు. కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాధాకృష్ణన్ ఎన్నిక బీజేపీ దక్షిణ భారత విస్తరణను బలపరుస్తుందని భావిస్తున్నారు. రేసులో వినిపిస్తున్న మరోపేరు థావర్ చంద్ గెహ్లోత్. ప్రస్తుతం కర్ణాటక గవర్నర్. మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ దళిత నాయకుడు. గెహ్లోత్ ఎంపీగా అనేకసార్లు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభలో సభా నాయకుడిగానూ ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగానూ పనిచేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో దళిత వర్గాల్లో మద్దతును బలోపేతం చేయడానికి ఈ ఎంపిక ఉపయోగపడవచ్చు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సిక్కిం గవర్నర్ ఓం మాథూర్, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్ఎస్ఎస్‌కు చెందిన శేషాద్రి చారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించాలంటే..
కేంద్ర మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవి రేసులో వినిపిస్తున్నాయి. వీరిద్దరూ బీజేపీ జాతీయాధ్యక్షులుగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, మంత్రులుగా పాలనా అనుభవం రాజ్యసభను నిర్వహించడంలో ఉపయోగపడతాయనే చర్చ కూడా ఉంది. గతంలో వెంకయ్య నాయుడు మాదిరిగా ఆ నేతలకు క్రియాశీల రాజకీయాల నుంచి గౌరవప్రదమైన నిష్క్రమణ కల్పించాలని బీజేపీ పెద్దలు భావించినట్టయితే వీరి పేర్లను పరిగణన లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి పైనా, తదుపరి ప్రధాని పీఠం మీద గురిపెట్టారన్న చర్చలు ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయ జీవితాన్ని ముగించుకునేందుకు ఇష్టపడతారా? అనేది ప్రశ్న.
సంఘ్ మూలాలున్నవారికే
ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి కచ్చితంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేపథ్యం కలిగినవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యం లేనివారికి పదవులు ఇచ్చినప్పుడు వారు పార్టీపై కృతజ్ఞత, విధేయతను ప్రదర్శించకుండా విమర్శకులుగా మారి పార్టీని ఇరకాటంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. సత్యపాల్ మాలిక్‌ను గవర్నర్‌గా చేస్తే.. ఆయన ఏకంగా మోదీనే ఇబ్బందుల్లోకి నెట్టారు. జగ్‌దీప్ ధన్‌ఖడ్ సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా వ్యవహరించారు. అందుకే ఈ రాజ్యాంగ పదవులను ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వ్యక్తులకే అవకాశం ఇవ్వాలన్న బలమైన ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తున్నది.
ఎన్డీఏ సంఖ్యాబలం
లోక్‌సభలో బీజేపీకి 240 మంది సభ్యులు, మిత్రపక్షాల 53 సీట్లతో కలిపి మొత్తం ఎన్డీయే బలం 293కు చేరుతుంది. రెండు సభలు కలిసి ఓటు వేసినప్పుడు, విజయానికి అవసరమైన సింపుల్ మెజారీటీని ఎన్డీయే సులభంగా అధిగమిస్తుంది. సభలో మెత్తం సభ్యుల సంఖ్య 542 … కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి (I.N.D.I.A)లో కాంగ్రెస్ నుంచి 99 లోక్‌సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా సరే ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టం. రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లు ఉండగా మిత్రపక్షాలైన జేడీ(యూ), ఏఐఏడీఎంకే, తెలుగుదేశం, ఎన్పీఎఫ్ ఇతర మిత్రపక్షాలతో కలిసి 132 సీట్లకు చేరింది. రాజ్యసభలో ఏడుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు. సాధారణ పరిస్థితుల్లో నామినేటెడ్ ఎంపీలు అధికారక కూటమికే మొగ్గు చూపుతుంటారు. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య 139కు చేరుతుంది. రాజ్యసభలో సభ్యుల సంఖ్య 239.
గత సమీకరణాలు – అనుభవాలు
2017లో ఉత్తరప్రదేశ్ నుంచి దళిత నాయకుడు రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎం. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుని, ఉత్తర – దక్షిణ భారతదేశ సమతుల్యత పాటించారు. 2022లో ఒడిశా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవడంతో, రాజస్థాన్ జాట్ నాయకుడు జగదీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. ఈసారి పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక తెరమీదికి వచ్చింది. ఉపరాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. ఇవి రానున్న రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు కారణమయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
ప్రతిపక్ష వ్యూహం
ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండి కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించాలని చూస్తోంది. పోటీ లాంఛనమే అయినప్పటికీ.. అధికార కూటమిని ఇరకాటంలో పడేసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతిపక్ష కూటమికి అవకాశం కలుగుతుంది.
ఇవి కూడా చదవండి..
Viral love story | అమెరికన్ భార్యతో ఇండియన్ యువకుడి పెళ్లి వెనుక హృదయాన్ని తాకే కారణం – వైరల్ వీడియో
Terrifying Video: Leopard Attack | సఫారీలో బాలుడిపై చిరుతపులి దాడి.. బెంగళూరులోని బన్నేర్‌ఘట్టలో ఘటన
Interesting Video | తైమూర్ మేక, అమూర్ పులి మధ్య ఆశ్చర్యకర స్నేహం!